రాష్ట్ర విభజనతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓ ప్రయోగశాలగా మారిందని చెప్పవచ్చు. ఏవిదంగా అంటే, పదేళ్ళపాటు హైదరాబాద్‌నే రాజధానిగా చేసుకొని పాలన సాగించాలా లేక ఏపీకి తాత్కాలికంగా కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలా? చేసుకొంటే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి? రాష్ట్రాన్ని ఎవరికి అప్పగించాలి? రాష్ట్రాన్ని ఏవిదంగా అభివృద్ధి చేసుకోవాలి? లక్షాలాది మంది ఉద్యోగులకు నెలనెలా జీతాలు ఎలా చెల్లించాలి? నిధులు ఎలా సమకూర్చుకోవాలి? ఏపీ వాటాగా వచ్చిన అప్పులు ఎలా తీర్చుకోవాలి?విద్యుత్ కష్టాలను ఎలా అధిగమించాలి? ఏ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి? ఇలా అన్నీ ప్రశ్నలే తప్ప సమాధానాలు లేవు.
అయితే చంద్రబాబు నాయుడు రాజకీయ, పరిపాలనా అనుభవం, పరిపాలాన దక్షత అన్నిటినీ పరిగణనలోకి తీసుకొన్న ఆంధ్రా ప్రజలు టిడిపిని గెలిపించి చంద్రబాబు నాయుడుకి ఏపీని గట్టెక్కించే బాధ్యత అప్పగించారు.
సమస్యలు, సవాళ్ళ నుంచే అవకాశాలను వెతుక్కోవాలని చెప్పే చంద్రబాబు నాయుడు, ప్రజల ఆకాంక్షల మేరకు పైన పేర్కొన్న అన్ని సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించి చూపారు. అన్నిటి కంటే ముందుగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న విద్యుత్ కొరత సమస్యను మంత్రదండం తిప్పి మాయం చేసిన్నట్లు మాయం చేశారు.
చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడే ఉద్యోగులకు నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించారు. రాజధాని కోసం 36 వేల ఎకరాలు భూసేకరణ చేసి అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. రాష్ట్రానికి పరిశ్రమలను రప్పించారు. విశాఖ నగరాన్ని హైదరాబాద్‌కు ధీటుగా ఐటి కేంద్రంగా మలిచేందుకు గట్టిగా కృషి చేశారు. భోగాపురం విమానాశ్రయం కొరకు రంగం సిద్దం చేశారు.
ఈ అభివృద్ధి-జాబితా చాలా పెద్దది కనుక దాని గురించి పూర్తిగా చెప్పుకోలేము. కానీ ఇన్ని చేసినా ప్రజలు చంద్రబాబు నాయుడుని పక్కన పెట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వమని వేడుకొంటున్న జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే.
రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వలననే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయిందని, నాలుగేళ్ళలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 40 ఏళ్ళు వెనక్కు వెళ్ళిపోయిందని చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతుండటం అందరూ వింటూనే ఉన్నారు. ఆయన మాటలతో ఏకీభవించేవారూ ఉన్నారు… విభేధించేవారు కూడా అంతే మంది ఉన్నారు. కారణాలు అనేకం!
కులపిచ్చి, సంక్షేమ పధకాల పేరుతో అప్పనంగా చేతికి డబ్బు అందుతుండటం, అభివృద్ధికి సంక్షేమానికి తేడా గుర్తించలేకపోవడం, ఇంకా రకరకాల రాజకీయ ఆలోచనలు… చాలానే ఉన్నాయి. కనుక ఇప్పుడు ఆంధ్రా ప్రజలు టిడిపి, వైసీపీలలో ఎటువైపు మొగ్గాలనే డైలమాలో ఉన్నారని భావించవచ్చు.
ఈ సమస్యలన్నీ సరిపోవన్నట్లు, తెలంగాణ సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీతో ఏపీలో ప్రవేశించేందుకు సిద్దం అవుతున్నారు. మరోవైపు బిజెపి కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో దించగా, కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలని బరిలోకి దించడానికి సిద్దమవుతున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళనకరమైనవే అని భావించవచ్చు. ఎందుకంటే, ఈ ముగ్గురూ ఏపీ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయగలవారే. కానీ బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలను గెలిపించి అధికారంలోకి తేగల శక్తి సామర్ధ్యాలు, అందుకు అనుకూలమైన రాజకీయ పరిస్థితులు లేవు.
కనుక వారు ముగ్గురూ, ఇంకా టిడిపి, జనసేన, వైసీపీలు, వామపక్షాలు ఎన్నికల బరిలో ఉంటే వాటి మద్య ఓట్లన్నీ చీలిపోయి రాష్ట్రంలో మరింత రాజకీయ అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దీని వలన కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు తప్పకుండా ఎంతో కొంత లాభపడతాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం మరోసారి తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయం.
కనుక వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల విజ్ఞతకు అగ్నిపరీక్ష వంటివని చెప్పకతప్పదు. కనుక ఆంధ్రా ప్రజలందరూ ఈ కులమత,రాజకీయాలకు, ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు లొంగిపోకుండా రాష్ట్రాన్ని గాడిన పెట్టగల పార్టీనే ఎన్నుకోవడం చాలా చాలా అవసరం. లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఇక ఎన్నటికీ కోలుకోలేని స్థితికి చేరుకొంటుంది. అప్పుడు నష్టపోయేది…. తమ తప్పుకు మరో 5 ఏళ్ళపాటు మూల్యం చెల్లించాల్సింది రాష్ట్ర ప్రజలే తప్ప ఈ రాజకీయ పార్టీలు కాదని గ్రహిస్తే మంచిది.



