సైలెంట్ పొలిటిషన్…మాటలతో కాదు చేతలలో సమాధానం చెపుతాను అంటూ దేశ ఆర్థిక పరిస్థితిని తన చాకచక్యంతో చక్కదిద్దిన మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ మరణంతో ఈ 2024 కు వీడ్కోలు పలకాల్సిన పరిస్థితి వచ్చింది. డిసెంబర్ 26 న తన తుది శ్వాస విడిచిన మన్మోహన్ కాంగ్రెస్ పార్టీ కే కాదు యావత్ భారత దేశానికే గర్వ కారకుడని చెప్పాలి.
ఆర్థిక మంత్రిగా, ప్రధాని మంత్రిగా భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఆయన అవలంబించిన విప్లవాత్మకమైన మార్పులు భారతీయ ఆర్ధిక ముఖ చిత్రాన్నే మార్చేశాయి. సంక్షోభంలో కూడా అవకాశాలను సృష్టించుకుని సంస్కరణల పేరుతో నాడు మన్మోహన్ నాటిన విత్తనమే నేడు దేశ ప్రజలకు ఫలాలను అందిస్తుంది.
అలాగే మరికొంతమంది ప్రముఖులను దూరం చేసి మరువలేని తీపి జ్ఞాపకాలను మిగిలిచింది 2024 . వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్ర రాజకీయాలకు పరిచయం అక్కరలేని పేరు ఈనాడు సంస్థ అధినేత శ్రీ రామోజీరావు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా గొంతు వినిపిస్తూ సూర్యోదయానికన్నా ముందే తెలుగు వాడి తలుపుతట్టే ఈనాడు తో తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు రామోజీ రావు. అటు వినోదాన్ని ఇటు రాజకీయాన్ని, అటు పోరాటాన్ని ఇటు సమయస్ఫూర్తి ని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్య పరుస్తూ వార్త పత్రిక చరిత్రలో తనకంటూ చెరపలేని కొన్నిపేజీలను లికించుకున్నారు రామోజీ రావు.
అయితే వయస్సు రీత్యా, అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఈ ఏడాది జూన్ 8 న ఇక సెలవుల అంటూ దివికేగిసారు ఈ అక్షర యోధుడు. ఇక అలాగే విలువలతో కూడిన వ్యాపారాన్ని ప్రజలకు అందిస్తూ, సేవా భావంతో కూడిన మనస్సుతో ప్రభుత్వాలకు చేయూతనిస్తూ భారతీయ వ్యాపార దిగ్గజాలతో ఒకరుగా నిలిచిన శ్రీ రతన్ టాటా కూడా ఇదే ఏడు అక్టోబర్ 9 న పరమ పదించారు.
పారిశ్రామిక వేత్తగా దేశానికే కీర్తిని తీసుకు వచ్చారు, అలాగే గొప్ప మనసున్న మానవతా వాదిగా దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఈయన మరణం టాటా గ్రూప్ సంస్థలకే కాదు భారతీయ పారిశ్రామిక రంగానికి తీరని లోటనే చెప్పాలి. ఎందరికో స్ఫూర్తినిచ్చిన రతన్ టాటా జీవితం ఎప్పటికి చిరస్మరణీయమే. ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ దేశం మొత్తం ఆయనకు కన్నీటి నివాళి అర్పించింది.




