పోసాని కృష్ణ మురళి వైసీపీ కండువా కప్పుకోవడం వలన తెలుగు సినీ పరిశ్రమ ఓ మంచి నటుడుని కోల్పోయిందని చెప్పవచ్చు. ఆయన రాజకీయాలలోకి వెళ్ళి ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కాగలిగారు. కనుక వైసీపీ కోణంలో నుంచే అన్నీ చూస్తూ మాట్లాడాల్సి ఉంటుంది కనుక అందరివాడుగా ఉండే ఆయన ఇప్పుడు వైసీపీవాడిగా మిగిలిపోయారు. అయితే అందుకు ఆయన బాధపడటం లేదు కనుక జనాలు కూడా బాధపడనవసరం లేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఇటీవల కొందరు సినీ ప్రముఖులు ఓ సినీ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నందీ అవార్డులు ఇవ్వడం మానేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే పోసానిలో నటుడు మేల్కొని జగనన్నని ఒప్పించి మళ్ళీ నందీ అవార్డులు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
విజయవాడలో ఓ కార్యక్రమంలో పోసాని మాట్లాడుతూ, “నంది అవార్డులు ఇచ్చే బాధ్యతను సిఎం జగన్మోహన్ రెడ్డి నాకు అప్పగించారు. ఇదివరకు నంది అవార్డులు హైదరాబాద్‌కే పరిమితమయ్యేవి. కానీ ఈసారి తెలుగు సినీ పరిశ్రమతో పాటు తెలుగు టీవీ రంగం, తెలుగు తెలుగు నాటక రంగాలకు కూడా నంది అవార్డులను ఇవ్వబోతున్నాము.
అయితే అన్నీ కలిపి ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాదు కనుక ముందుగా తెలుగు నాటక రంగంలో పద్య నాటకాలకు, ఆ తర్వాత మిగిలిన వాటికీ వరుసగా నంది అవార్డులు ఇస్తాము. ఎటువంటి రాజకీయ పట్టింపులు లేకుండా అత్యుత్తమమైన వాటికి, అత్యుత్తమైన నటీనటులు, సాంకేతిక నిపుణులకు మాత్రమే ఈ నంది అవార్డులు ఇస్తాము. వీటి ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తాము,” అని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం తీరు చూస్తున్నప్పుడు ఈ నంది అవార్డులు ఎవరెరికి లభిస్తాయో ఊహించి చెప్పవచ్చు. ఉత్తమ దర్శకుడు: రాంగోపాల్ వర్మ, ఉత్తమ చిత్రం: వ్యూహం, ఉత్తమ నిర్మాత: దాసరి కిరణ్ కుమార్, ఉత్తమనటి: రోజా, ఉత్తమ సహాయ నటుడు: పోసాని కృష్ణ మురళి, ఉత్తమ హాస్య నటుడు: అలీ, ఉత్తమ పక్క వాయిద్యాలు: లక్ష్మీ పార్వతి.
ఈ సందర్భంగా పోసాని మీడియాతో మాట్లాడుతూ, “ఏపీలో ఎక్కడైనా పూర్తి ఉచితంగా సినిమా షూటింగ్‌లు జరుపుకోవచ్చు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా ఏపీలో ఎక్కడైనా సినిమా స్టూడియోలు నిర్మించేందుకు వస్తే వారికి జగన్ ప్రభుత్వం అన్ని విదాల సహకరిస్తుంది,” అని చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఆస్కార్ అవార్డులు కూడా సంపాదించుకోగలుగుతోంది. కానీ సినీ పరిశ్రమకు పుట్టిల్లు వంటి ఆంధ్రాలో మాత్రం వేధింపులు తప్పడం లేదు. ఈ కారణంగా ఏపీలో సినిమాలు ప్రదర్శించుకోవడమే పెద్ద ప్రహసనంగా మారింది. మరి అటువంటప్పుడు సినీ పరిశ్రమను ఏపీకి రమ్మనమని పిలిస్తే ఎవరు మాత్రం వస్తారు?
ఎవరూ రారు కనుక వైసీపీ నేతలే స్టూడియోలు కట్టుకొని, పార్టీకి అనుకూలంగా ఉండేవారితోనే సినిమాలు నిర్మించుకొని, వారికి వారే నంది అవార్డులు ఇచ్చుకోవచ్చు కదా?కానీ వారు కూడా రిస్క్ తీసుకోవడం లేదు. అంటే అర్దం ఏమిటి?



