ప్రస్తుత పరిస్థితుల నుండి ‘టైం వాచ్’ను వినియోగించుకుని…. ఒక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ వ్యవస్థాపక రోజుకు వెళితే… పవన్ చేసిన సుదీర్ఘ ప్రసంగం ఎంత హైలైట్ అయ్యిందో… ఇంత పెద్ద ఎత్తున వేడుక నిర్వహించడం వెనుక “ఎవరున్నారో?” అన్నది కూడా అంతే సంచలనం రేపింది. ఆర్ధికంగా పవన్ కు అంత స్థోమత లేకవపోడమే దీనికి కారణంగా అప్పట్లో వార్తలు హల్చల్ చేసాయి. అయితే ఈ వేడుకలో కాసేపు పొట్లూరి వరప్రసాద్ హల్చల్ చేయడంతో ‘జనసేన’ వెనుక పివిపి ఆర్ధిక బలం ఉందన్న వార్తలకు బలం చేకూరింది.
ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల సమయంలో పవన్ కళ్యాణ్ ను ఇదే ప్రశ్న అడిగితే… తన ‘జనసేన’ వెనుక ఎవరూ లేరని స్పష్టమైన సమాధానం ఇచ్చారు. కానీ, తాము అనుకున్న ‘జనసేన’ వేరు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ‘జనసేన’ వేరు అంటూ పివిపి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పివిపి చెప్పిన ‘జనసేన’ అనుభూతులు రాజకీయ వర్గాల్లోనే కాదు, పవన్ అభిమానుల్లోనూ పెద్ద ఎత్తున చర్చలకు తెరలేపాయి.
“జనసేనను రాజకీయేతర శక్తిగా నడపాలని అనుకున్నామని, అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘జనసేన’ను రాజకీయ సంస్థగా మార్చేశారని, తాము అనుకున్నది ఒకటి అయితే, పవన్ చేసింది మరొకటి అని” ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ పరిణామాలతో తనతో పాటు మరికొందరం పూర్తిగా సైలెంట్ అయిపోయి, పక్కకు తప్పుకున్నామని అన్నారు. విజయవాడ ఎంపీ సీటు కావాలని పవన్ ద్వారా ప్రయత్నించానన్న వ్యాఖ్యలలో నిజం లేదని, వాస్తవానికి ఆ సమయంలో అసలు తానూ ఇండియాలోనే లేనని అన్నారు.
పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఆలోచన లేదని చెప్పిన పివిపి, వైసీపీ అధినేత జగన్ తో ఉన్న అనుబంధం గురించి కూడా ప్రస్తావించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లతో తనకు సాన్నిహిత్యం ఉందని, అయితే వారి వలన లాభం పొందినట్లు ఒక్క చిన్న నోట్ చూపించినా తానూ దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. జగన్ తో మాట తేడా వచ్చిన తర్వాత రాజకీయాల్లో సైలెంట్ అయిపోయానని, ఇక ఇప్పట్లో కూడా పొలిటికల్ ఎంట్రీ లేదన్న విషయాన్ని ప్రస్తావించారు పొట్లూరి వరప్రసాద్.



