గత ప్రభుత్వ తప్పుడు విధానాలు, తప్పుడు నిర్ణయాల కారణంగా డిస్కంలకు రూ.9,412.50 కోట్లు నష్టం వచ్చిందంటూ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.
Also Read – వివేకానంద గురించి జగన్ ట్వీట్
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచేసి ప్రజలపై పెను భారం మోపబోతున్నారని వైసీపీ వాదిస్తోంది. ప్రజలపై భారం వేస్తున్నప్పుడు ఈవిదంగా అధికార, ప్రతిపక్షాలు పరస్పరం నిందించుకోవడం పరిపాటిగా మారింది.
అంటే సమర్ధంగా పాలన చేయాలని ప్రజలు వాటికి అధికారం కట్టబెడితే, అవి తప్పులు చేస్తే వాటికి అధికారం అప్పగించిన పాపానికి అవి చేసిన తప్పులకి కూడా ప్రజలే మూల్యం చెల్లించాలన్న మాట!
Also Read – జగన్ అప్పులు చేసిపోతే.. చంద్రబాబు నాయుడు…
రూ.9,412.50 కోట్లలో ఉచిత ఇందన సర్ చార్జ్ సర్దుబాటు ఛార్జీలుగా రూ.1,500 కోట్లు మాత్రం ప్రభుత్వం భరించాలని మిగిలిన రూ.7,912.50 కోట్లు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసుకునేందుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణా మండలి ఆదేశాలు జారీ చేసింది.
ఈ డిసెంబర్ నెలలోనే ఒక్కో యూనిట్‌పై అదనంగా 40 పైసలు చొప్పున రూ.2,868.90 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతించింది. అంటే ప్రజలకు డిసెంబర్ విద్యుత్ బిల్లులు షాక్ ఇవ్వబోతున్నాయన్న మాట!
Also Read – బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ‘అన్-స్టాపబుల్’..!
ఇక మిగిలిన రూ.5044 కోట్లు 2025 జనవరి నుంచి 24 నెలల్లో వసూలు చేసుకునేందుకు అనుమతించింది. ఓ పక్క ప్రజల ముక్కు పిండి రూ.9,412.50 కోట్లు వసూలు చేసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసి, ప్రజలపై భారం పడకుండా చేసుకునేందుకు ఈవిదంగా విభజించామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది కదా?
అయినా ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకు లేదా వాటి తప్పుడు నిర్ణయాలకు ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి? ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు జగన్ 5 ఏళ్ళ పాటు సంక్షేమ పధకాల పేరుతో పప్పు బెల్లాలు పంచారు.
అదేవిదంగా టీడీపీ కూటమి కూడా సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వాటి కోసం అవి నిధులు కేటాయించగలుగుతున్నప్పుడు, తమ ఈ తప్పిదాలకు కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించుకొని ఈ భారం ప్రభుత్వమే భరించవచ్చు కదా?
కానీ పరస్పరం నిందించుకుంటూ సామాన్య ప్రజలపై భారం మోపుతుండటం తమని ఎన్నుకున్న ప్రజలను అపహాస్యం చేయడం కాదా?
ముఖ్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగానే ఇంత భారం మోపడం భావ్యమా?ఇటువంటివన్నీ ప్రజల పద్దులో ఎప్పటికప్పుడు నమోదు అవుతూనే ఉంటాయని, ఎన్నికలలో ఈ పద్దులే పార్టీల జాతకాలను తారుమారు చేస్తాయని వైసీపీ ఘోర పరాజయంతో నిరూపితమైంది కదా?