రెండు పడవల మీద కాలు మోపితే అది ఎంత కష్టంగా ఉంటుందో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సినీ, రాజకీయ రంగాలలో అడుగుపెట్టిన పవన్, అటు సినిమాలకు, ఇటు రాజకీయాలకు సరైన న్యాయం చేయడంలో విఫలమవుతున్నారనేది విశ్లేషకుల మాట. ముఖ్యంగా పవన్ అంగీకరించిన సినిమాలకు రాజకీయం ఒక ప్రధాన ఇబ్బందిగా మారిందనేది సినీ వర్గీయుల మాట.
ముందుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ అన్ని పవన్ పొలిటికల్ ఆలోచనలతో సరిగా జరగడం లేదన్నది గతంలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ విషయంలో నిరూపణ అయ్యింది. డైరెక్టర్ మార్పుతో మొదలైన ‘సర్ధార్’ సినిమా రూపకల్పనలో హీరోయిన్, సినిమాటోగ్రాఫర్ వంటి అనేక మంది మార్పులు చేర్పులతో ఎట్టకేలకు విడుదలై, ప్రేక్షకుల చేత తిరస్కరింపబడింది. అయితే, పవన్ అభిమానులు కలత చెందే విషయం ఏమిటంటే… తాజాగా సెట్స్ పైకి వెళ్ళిన ‘కాటమరాయుడు’ పరిస్థితి కూడా అలాగే ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇటీవల ప్రారంభమైన షెడ్యూల్స్ లో హీరోయిన్ శృతిహాసన్ పాల్గొనాల్సి ఉండగా, ప్రస్తుతం ‘సింగం 3’ షూటింగ్ లో లండన్ లో ఉండడంతో ‘కాటమరాయుడు’ వేచిచూడాల్సి ఉంది. నిజానికి, శృతి ఈ సినిమా కోసం సెప్టెంబర్ మొదటి వారంలో డేట్స్ ఇవ్వగా, పవన్ రాజకీయ సభల నేపధ్యంలో వాయిదా పడడంతో, ప్రస్తుతం డేట్స్ ను మళ్ళీ క్రమబద్దీకరించే వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే ‘సర్ధార్’ విషయంలో జరిగిన అనుభవమే, మరోసారి ఈ సినిమాకు కూడా పునరావృతం కాబోతుండడం విశేషం.
ఈ సినిమాకు ఎంపిక చేసిన సినిమాటోగ్రాఫర్ ‘బెంగాల్ టైగర్’ ఫేం సౌందర్ రాజన్ పక్కకు తప్పుకున్నాడని, సరైన సమయానికి పవన్ సినిమా ప్రారంభం కాకపోవడంతో, తప్పుకోవాల్సి రావడంతో, ఆయన స్థానంలో ‘అత్తారింటికి దారేది’ ఫేం ప్రసాద్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లోనే ఇన్ని ట్విస్ట్ లు ఎదురైతే, సినిమా పూర్తయ్యే నాటికి ‘కాటమరాయుడు’ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు అభిమానుల మదిలో ఆందోళనలు రేపుతున్నాయి. అయితే ఇలాంటి కష్టాలు పవన్ సినిమాలకు షరామామూలుగా మారిపోయాయి.



