ప్రముఖ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఆర్‌టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మూడు రాజధానులు, వాలంటీర్ వ్యవస్థల గురించి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పారు.
“మూడు రాజధానుల ఐడియా మీరే ఇచ్చారా?” అనే రవి ప్రకాష్ ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ సమాధానం చెపుతూ, “నేను ఎన్నికల వ్యూహాలు మాత్రమే రూపొందించి ఇస్తాను తప్ప పరిపాలనాపరమైన విషయాలలో ఎన్నడూ జోక్యం చేసుకోను.
నేను వైసీపి మ్యానిఫెస్టో కోసం ‘నవరత్నాలు’ రూపొందించి ఇచ్చిన మాట వాస్తవం. వాటితో వైసీపి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చింది కూడా. అయితే ఓ వ్యూహంతో ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చాక అప్పుడు ఓ ప్రభుత్వంలాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలే తప్ప ‘నవరత్నాలు’ దగ్గరే ఆగిపోకూడదు.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో చేయవలసిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. రాజధాని నిర్మించుకోవాలి. పోలవరం నిర్మించుకోవాలి. పరిశ్రమలు రప్పించి ఉద్యోగాలు కల్పించుకోవాలి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా నవరత్నాలు, సంక్షేమ పధకాలతోనే ముందుకు సాగితే అందుకు నేను ఎలా బాధ్యుడిని అవుతాను?
నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా నేను హాజరుకాలేదు. అప్పుడే బిహార్ వెళ్ళిపోయి అక్కడ నా పనులు చూసుకుంటున్నాను. కనుక మూడు రాజధానుల ఐడియా నాది కాదు. అది జగన్మోహన్ రెడ్డిదే!
పరిపాలనా వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని జగన్ చెప్పుకున్నారు. రాష్ట్రంలో అందుకు బలమైన పంచాయితీ రాజ్ వ్యవస్థ, దానిలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు కదా?కానీ జగన్ పరిపాలన వికేంద్రీకరణ సాకుతో రాష్ట్రంలో లక్షన్నర మంది వాలంటీర్లతో ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారానే లబ్ధిదారులకు సంక్షేమ పధకాల సొమ్ము చెల్లించడం మొదలుపెట్టారు.
జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతారు. వాలంటీర్లు ఆ డబ్బు తీసుకువెళ్లి లబ్ధిదారులకు ఇస్తారన్న మాట! మద్యలో పంచాయితీరాజ్ వ్యవస్థకి, దానిలో పనిచేసే సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఇతర సిబ్బందికి, చివరికి ప్రజా ప్రతినిధులకు కూడా సంక్షేమ పధకాల చెల్లింపులతో సంబంధం లేకుండా చేశారన్న మాట!
ఈవిదంగా జగన్మోహన్ రెడ్డి ఏదో ఆశించి ఏదో చేస్తే చివరికి మరేదో జరుగబోతోంది. రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థలను, యంత్రాంగాన్ని ఉపయోగించుకోకుండా, వాలంటీర్ సైన్యం సృష్టించుకొని అదనపు భారం పెంచుకోవడమే కాకుండా పార్టీకి నష్టం చేసుకొన్నారు,” అని ప్రశాంత్ కిషోర్ మాటల సారాంశం.




