ప్రశాంత్ కిషోర్‌ కూడా జగన్‌కి చెప్పేశారా?

Prashant Kishor Nara Lokesh

ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ శనివారం మధ్యాహ్నం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలిసి గన్నావరమ్ విమానాశ్రయం వద్ద కనిపించడంతో అప్పుడే రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలైపోయాయి. వారిద్దరూ కలిసి ఒకే కారులో ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళగా, అక్కడ టిడిపి ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం కూడా వారితో కలిసి సమావేశంలో పాల్గొంది.

ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ గత ఎన్నికలలో, రాబోయే ఎన్నికలలో కూడా వైసీపి కోసం పనిచేస్తోందని అందరికీ తెలిసిందే. ఆయన బృందం వైసీపి కోసం పనిచేస్తున్నప్పుడు, ఆయన చంద్రబాబు నాయుడుతో ఎందుకు సమావేశమయ్యారు? అనే సందేహం కలగకమానదు.

ADVERTISEMENT

గత ఎన్నికలలో ఐప్యాక్ సలహాలను, వ్యూహాలను జగన్మోహన్‌ రెడ్డి తూచ తప్పకుండా పాటించి అధికారంలోకి రాగలిగారు. కనుక రాబోయే ఎన్నికలలో కూడా ఐప్యాక్ సేవలను వాడుకోవాలనే అనుకొన్నారు. అయితే సంక్షేమ పధకాలే తమని గెలిపిస్తాయనే భ్రమలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డి వైసీపి ఎమ్మెల్యేల గురించి ఐప్యాక్ చేస్తున్న హెచ్చరికలను పట్టించుకోలేదు.

ఎమ్మెల్యేలకు క్లాసు పీకి గడపగడపకు పంపిస్తే అంతా సరైపోతుందనుకొన్నారు. అయితే తెలంగాణలో కేసీఆర్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళ్ళి బోర్లాపడటంతో జగన్‌ ఐప్యాక్ జాబితా బయటకు తీసి మార్పులు చేర్పులు మొదలు పెట్టడం అందరూ చూస్తూనే ఉన్నారు.

తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతోందని గ్రహించిన తర్వాతే కేసీఆర్‌ మేల్కొన్నారు. ప్రశాంత్ కిషోర్‌ని పిలిపించుకొని ఏదో విదంగా తమ పార్టీని ఒడ్డున పడేయమని వేడుకొన్నారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్‌ వెళ్ళిపోయారు. జగన్మోహన్‌ రెడ్డి కూడా కేసీఆర్‌లాగే వ్యవహరిస్తూ వైసీపిని ముంచేసుకోబోతున్నారని ప్రశాంత్ కిషోర్‌కు తెలుసు. కనుక ఇప్పుడు జగన్‌ని అప్రమత్తం చేసి ప్రయోజనం లేదని భావించి ఉండవచ్చు. బహుశః అందుకే చంద్రబాబు నాయుడుతో సమావేశానికి అంగీకరించి వచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడే దీనిపై ఊహాగానాలు చేయడం తొందరపాటే అవుతుంది. కనుక ఈ సమావేశం గురించి వారు ఏం చెపుతారో రేపు వారి నోటితోనే విందాము.

చివరిగా మంత్రి అంబటి రాంబాబు తాజా ట్వీట్ గురించి చెప్పుకోక తప్పదు. బహుశః నారా లోకేష్‌ని ఉద్దేశ్యించి కావచ్చు… “మెటీరీయల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడు?” అని ట్వీట్ చేశారు.

“మేస్త్రికి పని చేతకాకపోతే ఎంత మంచి మెటీరీయల్ ఇచ్చినా ఏం లాభం?” “వైసీపి మేస్త్రీ, మెటీరీయల్ రెండూ బాగోలేవని తేలిపోయింది కదా?” అంటూ రాంబాబుకి అప్పుడే కౌంటర్లు పడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories