ఆదివారం తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడ వద్ద పాదయాత్రలో ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్ ఆదివారం వర్షం కారణంగా పాదయాత్రను రద్దు చేసుకున్నారు. అక్కడే తాను బస చేస్తున్న శిబిరంలో పార్టీ అత్యున్నత కమిటీ సభ్యులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆయన బృందం హాజరయ్యారు.
ప్రశాంత్ కిషోర్ బృంద సభ్యులు క్షేత్రస్థాయిలో సేకరించిన అభిప్రాయాల సమాచారాన్ని సమావేశంలో వివరించారు. ఓ వైపు కేంద్రంపై అధికార తెదేపా ఎదురుదాడికి దిగుతుంటే.. ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రాన్ని ఏమీ అనడం లేదన్న భావనను క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యక్తమవుతోందన్న విషయం సమావేశంలో చర్చకొచ్చినట్లు సమాచారం.
ఉన్నఫళంగా ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచించినట్టు సమాచారం. దీనిలో భాగంగానే రాజ్యసభ ఉపాధ్యక్ష (డిప్యూటీ ఛైర్మన్) ఎన్నికల్లో భాజపా అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైకాపా నిర్ణయించింది. అయితే గతంలో ఇదే పార్టీ రాజ్యాంగ పదవులకు ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలనేది తమ అభిమతమని బీజేపీకి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మద్దత్తు ఇచ్చింది.
కాకపోతే ఇప్పుడు బీజేపీకి పూర్తిగా అనుకూలంగా మారుతున్నారు అని అభియోగాలు రావడం. ప్రశాంత్ కిషోర్ కూడా అదే చెప్పడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వనందువల్ల రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో భాజపా అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించాం అని పార్టీ ప్రకటించింది.



