chandrababu-naidu-and-nara-lokesh

చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు ముఖ్యమంత్రి?అనే చర్చలు జోరుగా సాగుతున్న ఈ సమయంలోనే సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా దీనికి జవాబు చెప్పారు.

ప్రస్తుతం దావోస్‌ సదస్సులో ఉన్న ఆయనని ‘ఇండియా టుడే’ విలేఖరి ఇదే ప్రశ్న అడిగినప్పుడు, “రాజకీయాలు, వ్యాపారం, సినీ పరిశ్రమ.. ఇలా ఏ రంగంలోనైనా వారసత్యంగా అన్నీ లభిస్తాయనుకోవడం చాలా పొరపాటు. చుట్టూ ఉండే పరిస్థితుల నుంచి అవకాశాలు లభిస్తుంటాయి. వాటిని సరైన సమయంలో ఎవరైతే గుర్తించి అందిపుచ్చుకోగలరో వారే రాణిస్తారు.

Also Read – జగన్‌ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?

కేవలం వారసత్వంతోనే ఏవీ లభించవు. రాజకీయాలు నాకు జీవనోపాధి కావు. దానికోసం 33 ఏళ్ళ క్రితమే కుటుంబ వ్యాపారం ప్రారంభించాను. నారా లోకేష్‌ కూడా ఆ వ్యాపారాలను చాలా సులువుగా నిర్వహిస్తున్నారు. కానీ ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతో రాజకీయాలలోకి ప్రవేశించి రాణించేందుకు కృషి చేస్తున్నారు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

అంటే వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి సాధ్యం కాదని, నారా లోకేష్‌ కూడా పార్టీలో, కూటమిలో మిగిలిన నేతలతో పోటీ పడుతూ అవకాశాలను అందిపుచ్చుకోగలిగితేనే ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పారు.

Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?

2014-19 మద్య నారా లోకేష్‌కి, ఇప్పటి నారా లోకేష్‌కి ఎంత తేడా ఉందో అందరికీ తెలుసు. వైసీపీ ఆయనని అవహేళన చేస్తూ మానసికంగా దెబ్బ తీసి రాజకీయాల నుంచి తప్పుకునేలా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసింది.

ఆ దురాలోచన వెనుక మరో పెద్ద దూరాలోచన కూడా ఉంది. ఏదోవిదంగా నారా లోకేష్‌ని రాజకీయాల నుంచి తప్పుకునేలా చేయగలిగితే, అప్పుడు టీడీపీ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం కీచులాడుకొంటూ పార్టీని విచ్ఛిన్నం చేస్తారని వైసీపీ భావించింది. కానీ వైసీపీ దురాలోచన బెడిసికొట్టింది.

Also Read – విశ్వసనీయత అంటే సంక్షేమ పధకాలు అమలుచేయడమేనా?

వైసీపీ విమర్శలు, అవహేళనల నుంచే పాఠాలు నేర్చుకొని నారా లోకేష్‌ బాగా సానపట్టిన కత్తిలా తయారయ్యారు. యువగళం పాదయాత్రలోనే అది నిరూపించి చూపారు. మంగళగిరి నుంచే మళ్ళీ పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. మంత్రిగా కూడా ఇప్పుడు తన సమర్దత నిరూపించుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు.

ఈ 5 ఏళ్ళలో నారా లోకేష్‌కి మరింత రాజకీయ, పరిపాలనా అనుభవం వస్తుంది. కనుక సిఎం చంద్రబాబు నాయుడు చెప్పిన్నట్లు 2029 నాటికి ఏర్పడే పరిస్థితుల నుంచి లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాజకీయాలలో మరింత రాణించేందుకు నారా లోకేష్‌ తప్పక ప్రయత్నిస్తారని వేరే చెప్పక్కరలేదు.




చివరిగా ఒక మాట చెప్పుకోవాలి. నాడు వైసీపీ అవహేళనాలు, బాడీ షేమింగ్ నుంచి నారా లోకేష్‌ పాఠాలు నేర్చుకొని తనని తాను మార్చుకుని ఈ స్థాయికి ఎదిగారు. కానీ వైసీపీ ఓటమి నుంచి జగన్‌ ఏమైనా పాఠాలు నేర్చుకున్నారా? నేర్చుకుంటారా?