ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడానికి ఏప్రిల్ 28వ తేదీకి సిద్ధమవుతున్న “బాహుబలి 2” సినిమాను కన్నడంలో విడుదల కానీవ్వబోమని, కన్నడిగుల సంఘాలు హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో… అక్కడ విడుదలపై కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంకా విడుదల తేదీకి 23 రోజుల సమయం ఉండడంతో, ఈ లోపున అన్ని సర్దుమనిగితే చాలనుకుంటున్నారు యంగ్ రెబల్ స్టార్ అభిమానులు. ఈ దిశగా కన్నడిగులకు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ కర్ణాటక గౌరవాధ్యక్షుడు రంజిత్ రెడ్డి ఓ పిలుపునిచ్చారు.
తన పుట్టిన రోజును పురస్కరించుకుని బొమ్మనహళ్లిలో హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్ లో ఉన్న సమర్థనం ట్రస్టులోని చిన్నారులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్న సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… కావేరి జలాల పంపిణీ విషయంలో, కర్ణాటకపై తమిళ నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన వ్యాఖ్యలను కన్నడ భాషాభిమానులుగా తాము కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అయితే సత్యరాజ్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని “బాహుబలి-2” సినిమా ప్రదర్శనను అడ్డుకోవద్దని సూచించారు.



