ఎనిమిదేళ్ల వయసు నుంచి తమ బిడ్డ సింధూ పడ్డ కష్టానికి ప్రతిఫలమే ఈనాటి ఒలింపిక్ పతకమని సింధు తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పీవీ రమణ, విజయలు తమ బిడ్డ పడ్డ కష్టాలను పంచుకున్నారు. బ్యాడ్మింటన్ లో శిక్షణ కోసం సింధూ రోజుకు 56 కిలోమీటర్ల దూరం ప్రయాణించేదని, సింధూకు పతకం రావడానికి కోచ్ పుల్లెల గోపీచంద్ తన కుటుంబానికి ఎంతో దూరమయ్యాడని చెప్పారు.
సింధూ ఎంత కష్టపడిందో, అంతకన్నా ఎక్కువగా గోపీచంద్ కష్టపడ్డారని, వీరిద్దరూ సినిమాలు, విందు వినోదాలకు దూరంగా ఉంటూ వచ్చారని, బాగా దగ్గరి బంధువుల ఇంట శుభకార్యాలకు కూడా సింధూ హాజరు కాలేదని చెప్పారు. ఇష్టమైన ఆహారానికి కూడా దూరమైందని, బ్యాడ్మింటనే తన ప్రపంచం అన్నంతగా మారిపోయిందని, ఆ కష్టం నేడు సఫలీకృతం కావడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని అన్నారు.
తెల్లవారుఝామున 3:30 గంటలకు ఆమెను లేపడానికి తమకు ఎంతో ఇబ్బంది అనిపించేదని, అయినా, ‘సింధూ టైమ్ అయింది’ అన్న తమ మాటలు వినగానే ‘డాడీ… 5 మినిట్స్’ అని చెప్పి వెంటనే రెడీ అయిపోయి 4 గంటల కెల్లా బయలుదేరి అకాడమీకి వెళ్లిపోయిందని సింధు పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. అంత అనిర్వచనీయమైన కష్టం పడబట్టే, నేడు కోట్లాది ప్రజల అభిమానాన్ని పొందగలిగింది అంటున్నారు వీక్షకులు.



