RRR : ప్రజలకోసం పోరాడేవాడెప్పుడూ నిజమైన రాజే!

Raghu Rama Krishna Raju“సాహసం శాయరా డింభకా” ఇది తెలుగు వారి అభిమాన నాయకుడు అన్న యన్టీఆర్ ను తిరుగులేని సూపర్ స్టార్ గా మలిచిన పాతాళభైరవి చిత్రంలోని డైలాగ్. ఈ సినిమాలో హీరో రాకుమారుడేమీ కాదు సాధారణ తోటమాలి కుమారుడు. ప్రజలను పీడించే రాణి గారి తమ్ముడిని ఎదిరించి ప్రజల మన్ననలు పొంది నాయకుడౌతాడు, దుష్ట శక్తులతో ప్రజలను తన గుప్పెట పెట్టుకోవాలనుకునే మాంత్రికుడిని కేవలం తన ధైర్య, సాహసాలతో నేల కూల్చి ఉజ్జయిని రాకుమారిని పొంది రాజౌతాడు. ఇందంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రజల కోసం దుర్మార్గాలను ఎదిరించే వాడు తోట రాముడైనా ప్రజల దృష్టిలో రాజే.

ఇంత ఉపోద్ఘాతం మన ప్రస్తుత కధనంలో తోట రాముడు అభిమానులు ప్రేమతో RRR గా పిలిచుకునే రఘరామకృష్ణం రాజు గారి గురించి. ఒక మూడేళ్ళ ముందు వరకు ఆయన గురించి జన బాహుళ్యంలో తెలిసింది కొంచెం మాత్రమే, దివంగత ముఖ్యమంత్రి వైయస్ కు సన్నిహితుడైన పారిశ్రామిక వేత్తగా, తరువాత రాజకీయ నాయకుడిగా, నర్సాపురం పార్లమెంట్ సభ్యుడిగా మాత్రం తెలుసు. తర్వాత ఆయన గురించి మెదటి తరం పారిశ్రామిక దిగ్గజం సిరీస్ రాజు గారి మనుమడిగా, కనుమూరి బాపిరాజు గారి వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులకు దగ్గర బంధువు వంటి విషయాలు తెలిసాయి. కానీ ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది ఈ విశ్లేషణాలు ఏవీ కాదు. స్వంత పార్టీ ప్రభుత్వం మీద ప్రజల గళం వినిపిస్తూ, ప్రభుత్వ తప్పులు బండకేసి బాదుతూ రోజూ సోషల్ మీడియాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల అభిమానం చోరగొన్న ఆయన, అదే ప్రభుత్వం చేతిలో బాదితుడుగా మారి, మృత్యువు అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత మరింత రెట్టించిన ఉత్సాహంతో పోరాటం చేస్తూ ఆ ప్రజల దృష్టిలో ధీరుడుగా మారారు. ప్రతిపక్ష పార్టీలు, నాయకులు, మీడియా చెప్పని ప్రభుత్వం తప్పులు అనేక విషయాలను రఘురామకృష్ణ గారు వివిధ వేదికల్లో చెబుతూ ప్రజల గొంతుకలా మారారు. తమ భాదలు రచ్చబండలో ప్రస్ధావించమని ఆయనకు రోజూ పదుల సంఖ్యలో వినతులు రావడం ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం.

ADVERTISEMENT

ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. ‘రాజు వెడలె రవితేజములనరగ’ అన్నట్టు ఈయన ఎక్కడ ఉంటే అక్కడ తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఆయనతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సినిమా వాళ్ళో, సెలబ్రిటీలో అయితే తప్ప ఒక రాజకీయ నాయకుడికి అమెరికాలో ఇంత స్పందన రావటం సాదారణ విషయం కాదు. నిజానికి ఆయన ఒక తెలుగు సంఘం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినా, తెలుగు ప్రజల కోరిక మేరకు వివిధ నగరాల్లో ఉన్న తెలుగు వారిని కలిసారు, అమెరికా నాలుగు దిక్కుల్లో ఉన్న వివిధ నగరాలను సందర్శించారు, వెళ్ళిన ప్రతిచోటా అదే ఆదరణ, అదే స్పందన. ఆయన సొంత పార్టీ అభిమానులు వివిధ రాజకీయ, సామాజిక ఇబ్బందుల వల్ల కలువకపోయినా, మిగితా తెలుగు వారు ప్రాంతాలకు, కులాలకు అతీతంగా రాజు గారిని కలిసి తమ ఆలోచనలు పంచుకున్నారు. తానా కార్యక్రమాల్లో కూడా ఆయన ఒక ముఖ్య ఆకర్షణగా మారారు. ఇదంతా ఆయన కుటుంబ నేపథ్యం వల్లో, పేరులో రాజు ఉండటం వల్లో వచ్చిన అభిమానం కాదు, ప్రజల కోసం ఆయన నిరంతరం సాగిస్తున్న పోరాటం వల్ల వచ్చిన గుర్తింపు. వాళ్ళలో 90% మంది రాజు గారికి తెలిసి ఉండకపోవచ్చు గానీ, వాళ్ళు ఆయనలో హీరో వర్షిప్ చూడటం మాత్రం నిస్సందేహంగా ఆయన ప్రభుత్వ తప్పులపై వినిపిస్తున్న అలుపెరగని గళం వల్లనే. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ ఆయన విదేశాల నుండే తన రచ్చబండ కార్యక్రమం కొనసాగించం విశేషం. బహుశా ప్రవాసాంధ్రలతో తన అనుభవాలు, రాష్ట్ర పరిస్ధితుల మీద వారి ఆలోచనలు భవిష్యత్తులో అందరితో పరచుకుంటారని ఆశించవచ్చు. ముందు చెప్పుకున్నట్టు ప్రజల కోసం పోరాడే వాడు ఎప్పుడూ రాజే!

– శ్రీకాంత్ సి

ADVERTISEMENT
Latest Stories