క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు పరిచయం అయిన రాజా రవీంద్ర… సినీ రంగంలో అనేక మంది స్టార్లకు పర్సనల్ మేనేజర్ గా పని చేసిన సంగతి సినీ విజ్ఞులకు తెలిసిందే. పాత కాలంలోనే కాదు, ఇప్పటికీ ఎంతో మంది డేట్స్ ను రాజా రవీంద్రనే చూస్తుంటారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో దాదాపు పదేళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసారు రాజా. ఆనాటి మధుర జ్ఞాపకాలను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజా రవీంద్ర గుర్తుకు తెచ్చుకున్నారు.
‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవి 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారని… షూటింగ్ ఆలస్యమైతే శ్రీదేవి డేట్స్ అయిపోతాయనే కారణంతో… అంత జ్వరంలోనూ షూటింగ్ కు వచ్చారని రాజా రవీంద్ర తెలిపారు. పాట షూటింగ్ కొనసాగిన సమయమంతా చిరంజీవికి జ్వరం తగ్గలేదని… చివరి రోజు షూటింగ్ లో స్పృహ కోల్పోయి, పడిపోయారని చెప్పారు.
ఆ తర్వాత రెండు రోజుల వరకు కళ్లు తెరవలేదని, తాము చేస్తున్న పని పట్ల ఇంత అంకితభావం తాను మరే నటుడిలో చూడలేదని ప్రశంసించారు. మరి అంతలా మెగాస్టార్ మెస్మరైజ్ చేయగలిగారు కాబట్టే… ఆ పాట ఇప్పటితరాన్ని కూడా ఒక ఊపు ఊపుతూనే ఉంది. నిజానికి ఆ పాట చూస్తుంటే… మెగాస్టార్ అంత జ్వరంతో చేయగలిగారా? అన్న అనుమానం కలుగక మానదు.



