ఎప్పుడూ గంభీరంగా కనిపించే ‘దర్శకధీరుడు’ రాజమౌళి, ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి కారణం మాత్రం… ‘పెద్దన్న’ అయిన కీరవాణి. రొటీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లా కాకుండా, ఇంతటి సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభించేలా… ‘బాహుబలి’ సినిమా సాంకేతిక నిపుణుల నుండి నటీనటుల వరకు ఒక్కో వీడియోను కట్ చేయగా, అందులో భాగంగా దర్శకుడు రాజమౌళిని కీర్తిస్తూ కీరవాణి ఓ పాట పాడారు.
‘బాహుబలి’ సినిమాలోని ‘శివుని ఆన’ అనే పాటలో లిరిక్స్ ను మార్చి, రాజమౌళి మీద పాడిన విధానానికి బాగా ఉద్వేగానికి గురైన రాజమౌళి, వేదిక పైనే అటు వైపుగా తిరుగుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ పాటలో లిరిక్స్ అంతలా ప్రభావితం చేసాయి మరి! రాజమౌళి ఏడుపును తట్టుకోలేకపోయిన తనయురాలు కూడా వేదిక దిగి క్రిందికి రాగానే తండ్రిని పట్టుకుని ఉద్వేగానికి గురయ్యారు. దేశం మొత్తం చూపును తన వైపుకు తిప్పుకున్న ఈ ప్రతిష్టాత్మక వేడుకలో రాజమౌళి ఉద్వేగానికి గురికావడం అనేది హైలైట్ గా నిలిచింది.



