జయలలిత వల్ల తాను ఎన్నో కష్టాలు పడ్డానని, 2013లో తాను నిర్మించిన ‘విశ్వరూపం’ చిత్రం విడుదలకు ఆమె ఎన్నో ఆటంకాలు కల్పించిందని ‘యూనివర్సల్ స్టార్’ కమలహాసన్ అన్నారు. తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… తమిళనాడులో ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏర్పాటు అయిందని, అందుకని ప్రభుత్వంలో ఉన్న వారిని తాను చికాకు పెడుతూనే ఉంటానని హెచ్చరించారు.
తమిళనాడులో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన కమల్, ప్రభుత్వంలో ఎవరు ఉన్నా వారిని ప్రశ్నిస్తానని అన్నారు. నాడు తన సినిమా ‘విశ్వరూపం’ కోసం తన సర్వస్వాన్ని పెట్టి నిర్మించానని, ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఈ సినిమా ఉందంటూ నాడు అన్నాడీఎంకే ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాపై నిషేధం ఎత్తివేయకపోతే రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతానని నాడు కమల్ కన్నీళ్లు పెట్టుకుంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే.



