
ఎస్సీ వర్గీకరణ సాధ్యాసాధ్యాలు, సిఫార్సులతో కూడిన నివేదికని రాజీవ్ నందన్ మిశ్రా (ఏక సభ్య కమీషన్) ఏపీ ప్రభుత్వానికి అందజేశారు.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దేశంలో మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ అమలుచేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ సున్నితమైన ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, వాటి ఆధారంగా రిజర్వేషన్స్ అమలుచేయడం అంటే తేనెతుట్టెని కదిపిన్నట్లే అని చాలా ఆలస్యంగా గ్రహించారు.
Also Read – మంచు ఫ్యామిలీ వార్: ఇక్కడ కూడానా…?
దాని కోసం కమీషన్ వేశారు. రాష్ట్రంలో సమగ్ర కుల సర్వే చేయించి ఆ నివేదిక కూడా సిద్దం చేసుకున్నారు. రెండు నివేదికల ఆధారంగా శాసనసభలో తీర్మానం చేసి ఆమోదింపజేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాయితీగానో లేదా ఎస్సీ వర్గీకరణ క్రెడిట్ కోసమో చేసిన ఈ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సమగ్ర కులసర్వే జరిపిన తీరుని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పు పట్టాయి. దానిలో ఉద్దేశ్యపూర్వకంగానే లక్షల మంది బీసీ జనాభాను తక్కువ చేసి చూపారని విమర్శించాయి. ఆ కారణంగా మరోసారి సర్వే జరపాల్సి వచ్చింది. అంటే సర్వేలో తప్పులు జరిగాయని అంగీకరించిన్నట్లయింది.
Also Read – పవన్ కళ్యాణ్ అంత సీన్ లేదట!
ఆ సర్వే, నివేదికలు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తూ తెలంగాణలో బీసీ సంఘాలు ఆందోళనలకు సిద్దమయ్యాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్‌మార్ మల్లన్న తమ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందంటూ సమగ్ర కుల గణన నివేదిక ప్రతులను కాల్చి నిరసన తెలపగా, కాంగ్రెస్ పార్టీ ఆయనని సస్పెండ్ చేసింది.
Also Read – పోసాని కి దక్కని జగన్ ఓదార్పు…వై.?
ఇటు సొంత పార్టీలో, అటు ప్రతిపక్షాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నుంచి వస్తున్న ఈ ఒత్తిళ్ళు కారణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడావుడిగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపి, దాని కోసం శాసనసభలో తీర్మానం చేయబోతోంది.
కానీ దానిని అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం, రాజ్యాంగ సవరణ అవసరం. ఆ రెండూ అసాధ్యం. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం సృష్టించుకున్న ఈ సమస్య నుండి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంగానే అందరూ చూస్తున్నారు. దీని వలన కూడా రేవంత్ రెడ్డి విశ్వసనీయత దెబ్బ తింటుందని వేరే చెప్పక్కరలేదు.
తెలంగాణతో పోలిస్తే ఏపీలో రాజకీయాలపై కుల ప్రభావం చాలా ఎక్కువ. పెద్దగా కుల ప్రభావం లేని తెలంగాణ రాష్ట్రంలోనే ఇన్ని సమస్యలు ఉద్భవిస్తే, ఈ విషయంలో ఏమాత్రం తప్పటడుగు వేసినా ఏపీలో మరింకెన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయో ఎవరూ ఊహించలేరు.
అందువల్లే సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తొందరపడలేదు. అలాగని అలసత్వం చూపకుండా వెంటనే రాజీవ్ నందన్ మిశ్రా ఏక సభ్య కమీషన్ ఏర్పాటు చేశారు.
ఈలోగా తెలంగాణలో ఇన్ని పరిణామాలు జరిగాయి. కనుక నివేదిక ప్రకారం ముందుకు సాగితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందో ఏపీ ప్రభుత్వానికి మరింత స్పష్టత వచ్చింది. కనుక ఇప్పుడు ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం ఏవిదంగా ముందుకు సాగుతుందో చూడాలి.