సిల్వర్ స్క్రీన్ పై మొత్తం మూడు సార్లు కలిసి నటించగా, అందులో రెండు సార్లు టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది ఈ జోడి. అవును ‘మగధీర’ సినిమాలో చెర్రీ సినిమాలో చిరు అతిథి పాత్ర పోషించగా, తాజాగా చిరు ‘ఖైదీ నంబర్ 150’లో చెర్రీ గెస్ట్ రోల్ చేసి అభిమానులను అలరించడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. అయితే ఈ రెండింటి కంటే ఎక్కువ సేపు తళుక్కుమన్న “బ్రూస్ లీ” మాత్రం దారుణ పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.
సిల్వర్ స్క్రీన్ పై వీరిద్దరి మల్టీస్టారర్ జోడి ఇలా ఉంటే, తాజాగా బుల్లితెరపై ఈ మెగా కలయికకు శ్రీకారం చుట్టారు. మెగాస్టార్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో సెలబ్రిటీ హోదాలో రామ్ చరణ్ సందడి చేయనున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తయిన ఈ ఎపిసోడ్ త్వరలోనే బుల్లితెర ప్రేక్షకులను పలకరించనుంది. అలాగే వీరిద్దరితో పాటు ఈ ఎపిసోడ్ లో అందాల బొమ్మ రంభ కూడా భాగస్వామ్యం అయ్యింది. కన్నులవిందుగా మారిన ఈ ఎపిసోడ్ కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు.



