ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించిందని, ఏకంగా 100 కోట్ల షేర్ ను కొల్లగొట్టిందని ఇటీవల వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. గ్రాస్ విషయంలో అయితే అధికారికంగానే చిత్ర యూనిట్ నుండి ఓ పోస్టర్ విడుదలైంది. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నిజంగానే ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ అసలైన సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.
అయితే చిత్ర యూనిట్ నుండి మాత్రం అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు గానీ, ఫస్ట్ డే కలెక్షన్స్ పై అల్లు అరవింద్ మాత్రం ఒక ప్రకటన చేసారు. ఇటీవల కాలంలో ఏ సినిమాకు అఫీషియల్ ప్రకటనలు లేకపోవడంతో, సోషల్ అండ్ వెబ్ మీడియాలో హల్చల్ చేసే కలెక్షన్స్ నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ లెక్కల ప్రకారం చిరు రీ ఎంట్రీ సినిమా 100 కోట్ల షేర్ ను, 150 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగబాబు కూడా 150 కోట్ల గ్రాస్ ను ధృవీకరించిన విషయం తెలిసిందే.
అయితే ఇవన్నీ ఫేక్ కలెక్షన్సా? అనే విధంగా తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కధనం ఉంది. సదరు వివరాల ప్రకారం… ఐటీ అధికారులు నిర్మాత రామ్ చరణ్ ను కలిసిన సమయంలో తన సినిమాకు అయిన ఖర్చు 60 కోట్లు అని, ఇందులో సినిమా హీరో చిరంజీవికి 20 కోట్లు, వినాయక్ కు 10 కోట్లు ఉన్నాయని, ఇక సినిమాకు వచ్చిన రెవిన్యూ మొత్తం 75 కోట్లు అని, తనకు వచ్చిన లాభం 15 కోట్లకు ఈ ఏడాదిలో ఖచ్చితంగా పన్ను చెల్లిస్తానని చెర్రీ ఐటీ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ కలెక్షన్స్ మాయ ఏమిటో సామాన్య ప్రేక్షకులకు అర్ధం కాదు గానీ, పన్ను తక్కువ చెల్లించేందుకు ‘ఖైదీ నంబర్ 150’ కలెక్షన్స్ ను తగ్గించారా? లేక నిజంగా అంతే కలెక్షన్స్ అందిపుచ్చుకుందా? అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు టాలీవుడ్ నెంబర్ 2 పొజిషన్ లో “ఖైదీ నంబర్ 150” ఉందని సంబరపడుతున్న మెగా అభిమానులకు సదరు దినపత్రిక కధనం షాక్ ఇచ్చినట్లయ్యింది. అయితే, మొదట నుండి ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో ఏదొక వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.



