డ్రగ్స్ కేసులో జరుగుతున్న విచారణపై ప్రముఖ మీడియా ఛానల్ టీవీ 9 ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను అందిస్తున్న నేపధ్యంలో… మీడియాకు ఇలా లీకులు ఇవ్వడమేంటి? తెలియజేస్తే అధికారికంగా సిట్ అధికారులే తెలియజేయాలి కదా? అంటూ ప్రశ్నించిన రాంగోపాల్ వర్మకు కూడా త్వరలో సిట్ నుండి నోటీసులు రాబోతున్నాయా? అంటే అవుననే సదరు మీడియా కధనాలను ప్రసారం చేస్తోంది. తొలి రోజు పూరీ జగన్నాధ్ విచారణలో అక్కడక్కడ వర్మ పేరు రాగా, సుబ్బరాజు విచారణలో మాత్రం చాలా సార్లు వర్మ పేరు వచ్చినట్లుగా ఈ కధనాల సారాంశం.
ఇందులో భాగంగా అదే మీడియా ఛానల్ లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వర్మ, తాను ఇప్పటివరకు డ్రగ్స్ తీసుకోలేదని, కానీ డ్రగ్స్ కంటే దారుణమైనవి చాలా చేసానని, అవి మాత్రం యాంకర్ చెవిలో చెప్తాను అంటూ వెల్లడించారు. అయితే పూరీ, సుబ్బరాజుల విచారణలో తన పేరు తెరపైకి రావడంతోనే వర్మ కౌంటర్ ఎటాక్ లో భాగంగా సిట్ అధికారుల కంటే ముందు తానే రంగంలోకి దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వరుస కధనాలలో భాగంగా… తాజాగా సదరు మీడియా ఛానల్ మరిన్ని సంచలనాలు జరగబోతున్నాయంటూ ట్రేడ్ వర్గాలలో కలకలం సృష్టించే వ్యాఖ్యలు చేస్తోంది.
రాబోతున్న వారంలో కొన్ని అరెస్ట్ లు ఉండవచ్చని, మూడు నాలుగు సినిమాలతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న ఓ యువహీరో తండ్రికి నోటీసులు జారీ కావచ్చని, అలాగే టాలీవుడ్ బడా నిర్మాత కూడా ఇందులో ఉన్నట్లు పేర్లు వెల్లడించకుండా చేస్తున్న కధనాలు తెలుగు సినీ పరిశ్రమలో ముచ్చెమటలు పట్టిస్తోందని చెప్పడంలో సందేహం లేదు. అలాగే ఓ అగ్ర నిర్మాతకు చెందిన ఇద్దరు తనయులకు కూడా ఇందులో భాగం ఉందని, రాజకీయ ఒత్తిడిలు లేని పక్షంలో ఈ ఇద్దరు పేర్లు కూడా తెరపైకి వస్తాయని, వీరికి కూడా నోటీసులు వెళ్తాయని ప్రసారాలు చేస్తోంది. అంటే పరోక్షంగా ఈ కేసులో రాజకీయ ప్రమేయం కూడా ఉందని చెప్పకనే చెప్తున్నారు.



