వైసీపీ ప్రభుత్వం అధికారం అందిపుచ్చుకున్న నాటి నుంచి అధికారాన్ని కోల్పోయే వరకు కూడా అటు ప్రతిపక్ష పార్టీలతో సమానంగా కొన్ని మీడియా ఛానెల్స్ ను టార్గెట్ చేస్తూ ఐదేళ్లు వేధింపులే ప్రథమావధిగా పాలన కొనసాగించింది.
అయితే జగన్ ప్రభుత్వ విధ్వంస ఖాండలో దాదాపు 5 దశబ్దాల అనుభవం ఉన్న ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు కూడా బాధితులుగా మిగలక తప్పలేదు. ఈనాడు గ్రూప్ సంస్థలలో భాగమైన మార్గదర్శి చిట్స్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ ను అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం రామోజీ రావు ను కేసుల పేరుతో వేధింపులకు పాల్పడింది.
ఆయన అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్ మీద ఉన్న సమయంలో కూడా రామోజీ రావు అరెస్టు కాబోతున్నారంటూ వార్తలు ప్రచురించి 5 దశాబ్దాలుగా ఎంతో కష్టపడి సమాజంలో తానూ సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను దిగజారుస్తూ మానసికంగా దెబ్బ కొట్టింది జగన్ సర్కార్.
అయితే 8 పదుల వయస్సులో కూడా జగన్ వంటి ఒక నియంత ప్రభుత్వాన్ని ఎదురిస్తూ తన ఈనాడు పత్రికతో రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించారు రామోజీ రావు. ఐదేళ్ల తన అక్షర పోరాటానికి జూన్ 4 తో ముగింపు పలికి ఆనందాన్ని అనుభవించిన ఈ పెద్దాయన సంతృప్తిగా ప్రాణాలు విడిచారు.
అయితే రామోజీ రావు మరణ వార్తతో అటు రాజకీయ ప్రముఖులు ఇటు సినీ రంగ ప్రముఖులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. ఏపీ కాబోయే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్న చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు రామోజీ పార్థివ దేహానికి అశృనివాళి అర్పించారు.
తనకు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా రామోజీ రావు సలహాలు తీసుకుంటానని ఆయన లేని లోటు ఎప్పటికి అలానే ఉంటుందంటూ బాబు రామోజీ మరణం పై స్పందించారు. అలాగే జనసేన అధినేత పవన్ కూడా మాట్లాడుతూ ఏపీలో ఉన్న చాలా మంది జర్నలిస్టులు ఈనాడు స్కూల్ నుంచి వచ్చిన వారేనన్నారు.
అలాగే ఆయన చివరి దశలో ప్రభుత్వాల నుండి వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ తలవంచక నిలబడి అక్షరాలతో ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉన్నారంటూ కొనియాడారు. తానూ కూడా ప్రమాణస్వీకారం చేసిన తరువాత వచ్చి రామోజీ రావు ను కలవాలనుకున్నని ఇంత లోపే ఈ దారుణం జరిగిందంటూ వాపోయారు పవన్.
అయితే ఈ ఐదేళ్లుగా ఈనాడు ను అడ్డుపెట్టుకుని ఆయన సాగించిన అక్షర యుద్దానికి నేడు ఫలితంగా వైసీపీ ఓటమితో రామోజీ విజయం సాధించినట్లయ్యింది. తెలుగు జాతి బాగు కోసం, తెలుగు వాడి అభివృద్ధి కోసం ఎప్పుడు పరితపించే రామోజీ రావు ప్రతి తెలుగు వాడి విజయంలోనూ కనిపిస్తూనే ఉంటారు.




