టాలీవుడ్ స్క్రీన్ పైకి “లీడర్”గా అడుగుపెట్టిన దగ్గుపాటి రానా కెరీర్ ఉజ్వల రీతిలో సాగిపోతోంది. ఆ భాష, ఈ భాష అన్న తారతమ్యం లేకుండా నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటోన్న రానా, తాజాగా నటించిన “ఘాజీ” సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలను అందుకుంటున్నాడు. అలాగే మరో వైపు ఏప్రిల్ లో “బాహుబలి 2” చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకులను ముగ్ధమనోహరంగా అలరించడానికి సిద్ధమవుతున్న రానా కెరీర్ లో మొదటి సినిమా “లీడర్” ఎప్పటికీ ఓ స్పెషలే!
ఒక సినీ వారసుడు మొదటి సినిమానే ఇలాంటి కధతో ప్రేక్షకుల ముందుకు వస్తారా అని ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఉన్న “లీడర్” సినిమాకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద ఆశించినంత రీతిలో సందడి చేయకపోయినా శేఖర్ కమ్ముల దర్శకత్వం, డైలాగ్స్, రానా అభినయం ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. అలాంటి సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోందని, రానా చెప్పడంతో “లీడర్” సినిమా అభిమానులందరికీ పండగ లాంటి వార్తను అందించారు రానా.
హృదయానికి హత్తుకునే డైలాగ్స్ “లీడర్” సినిమాకు ప్రాణంలా నిలిచాయి. ముఖ్యంగా ఓ ముసలాయన, తన కూతురిని ముఖ్యమంత్రిగా ఉన్న రానా కారులో పంపిస్తానంటే… వద్దయ్యా… బస్సులోనే వెళ్తాం… బస్సులో అయితే పదిమంది ఉంటారు… అని చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల మదిని టచ్ చేసింది. అలాంటి అద్భుతమైన మాటలతో నిండి ఉన్న ఈ సినిమాకు సీక్వెల్ వస్తే… బహుశా “లీడర్” సినిమాకు ఇవ్వలేని సక్సెస్ ను, ఈ సీక్వెల్ కు ప్రేక్షకులు అందిస్తారేమో చూడాలి.



