పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన కొత్త 2 వేల రూపాయల నోటు సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ… ఇంత పెద్ద నోటు అవసరం కూడా మార్కెట్ లో లేదని, తక్షణమే దీనిని కూడా రద్దు చేసి 200 రూపాయల నోటు ప్రవేశపెట్టాలని సూచనలు చేసారు. అప్పటివరకు 100 రూపాయల నోటు తర్వాత 500, 1000, 2000 రూపాయల నోట్లే చూసిన ప్రజలకు, ఈ 200 రూపాయల నోటు సౌండింగ్ కాస్త కొత్తగా వినపడింది. అయితే చంద్రబాబు చెప్పిన మాట వాస్తవమే గానీ, దీనికి పొలిటికల్ వర్గాలతో పాటు ప్రజలు కూడా ఎవరూ పెద్దగా ప్రాధాన్యత ఇచ్చింది లేదు.
అయితే తాజాగా ఇదే నిర్ణయం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుండి వెలువడింది. త్వరలో 200 రూపాయల నోటును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. గత నెలలో జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్టు, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ 200 రూపాయల నోట్ల ముద్రణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ లావాదేవీలు సంతృప్తికరంగా లేకపోవడంతో, చిన్న నోట్ల కొరత కారణంగానే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు రిజర్వు బ్యాంకు అధికారులు నిరాకరించారు.



