‘కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. అది తనని తాను ఓడించుకున్నప్పుడే ఇతర పార్టీలకు అధికారంలోకి వస్తుంటాయి…’ అనే రాజకీయ నానుడి చాలా పాతది. తెలంగాణ కాంగ్రెస్ దీనిని మరోసారి నిరూపించి చూపేందుకు సిద్దమవుతోంది.
టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు జీర్ణించుకోలేకపోవడం అందరూ చూశారు.
కానీ ఆ దేశముదురు సీనియర్లలో ఏ ఒక్కరూ పార్టీని ఎన్నికలలో గెలిపించి అధికారంలోకి తీసుకు రాలేకపోయారు. వారికి ఆ సామర్ధ్యం లేదని కాంగ్రెస్ అధిష్టానం గ్రహించినందునే రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది.
ఆయన ఎన్నికలలో పార్టీని గెలిపించుకొని, అధికారంలోకి తీసుకువచ్చి అధిష్టానం మెప్పు పొందారు. కనుకనే అధిష్టానం మద్దతు ఉన్న రేవంత్ రెడ్డికి సీనియర్లు అందరూ భజన చేస్తూ 15 నెలలు కాలక్షేపం చేశారు. కానీ ఎల్లకాలం భజన చేయలేరు.
కనుక మెల్లగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో గొంతు వినిపిస్తోంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరో మాట్లాడితే అర్దం చేసుకోవచ్చు. సాక్షాత్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయనేమన్నారంటే, “కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంది. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి ఉండాలని రాహుల్ గాంధీ అనుకున్నారు. కనుక ఆయన నిర్ణయం మేరకు వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ ముఖ్యమంత్రి వస్తారు. అంతవరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. వచ్చే ఎన్నికలలో బీసీలు, బీసీ ముఖ్యమంత్రి ప్రధానాంశంగా ఉండబోతున్నాయి,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో తప్ప మరేపార్టీలో ఈవిదంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడటం వినబడదు. రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలకే నమ్మకం, గౌరవం లేనప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ఎందుకుంటుంది?తనకు పార్టీ నేతల మద్దతు లేదని తెలిసి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిలో అభద్రతాభావం పెరగదా?ఆ ప్రభావం ఆయన నిర్ణయాలు, పాలనపై పడవా?అంటే తప్పకుండా పడతాయి.
కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ కంటే ముందు సొంత పార్టీ నేతలతోనే అంతర్గత పోరాటాలు చేస్తూ పార్టీపై, ప్రభుత్వంపై పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నించక తప్పదు. అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరాటాలు ప్రారంభం కాబోతున్నాయని అనుకోవచ్చు.
కనుక కాంగ్రెస్ పార్టీ మరోసారి తనని ఓడించుకొని బిఆర్ఎస్ పార్టీకి అధికార పగ్గాలు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించిందనే భావించవచ్చు.
బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా “కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కూల్చనక్కరలేదు.. వాళ్ళే కూలచేసుకొని మాకు అధికారం అప్పజెప్పేస్తారు,” అని చెపుతున్నారు కదా?




