రేవంత్‌ విదేశీ పర్యటన: బిఆర్ఎస్ హడావుడే ఎక్కువ?

Revanth Reddy

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి బృందం పది రోజులు అమెరికా పర్యటన ముగించుకొని అక్కడి నుంచి నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చేరుకుంది. నేడు అక్కడి కంపెనీలతో సమావేశమయ్యి తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకు వారు ప్రయత్నిస్తారు.

రేవంత్‌ రెడ్డి బృందం విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నప్పుడు శుభాకాంక్షలు చెప్పి తెలంగాణ అభివృద్ధికి ఎవరు కృషి చేస్తున్నా సంతోషిస్తానని చెప్పిన కేటీఆర్‌, ఆ మరుసటి రోజు నుంచే దుష్ప్రచారం చేస్తుండటం చాలా శోచనీయం.

ADVERTISEMENT

రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనపై కేటీఆర్‌, బిఆర్ఎస్ పార్టీ విషం కక్కడం దేనికంటే బహుశః గతంలో తాను విదేశీ పర్యటనలు చేసి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు సాధించాననే గర్వం లేదా అహంకారం వల్ల కావచ్చు. లేదా ఈ విషయంలో రేవంత్‌ రెడ్డి తనకు సాటిరారని చెప్పుకునేందుకు కావచ్చు. లేదా పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా రేవంత్‌ రెడ్డి విఫలమయ్యారని దుష్ప్రచారం కోసం కావచ్చు.

కారణం ఏదైనప్పటికీ రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనలో పెట్టుబడులు సాధించడం అంతా బోగస్ అని దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు.

ఒకవేళ కేటీఆర్‌కి నిజంగా తెలంగాణ పట్ల అంత మమకారం, నిబద్దత ఉండి ఉంటే అమెరికాలో తనకున్న పరిచయాల ద్వారా రేవంత్‌ రెడ్డి బృందానికి సాయపడి ఉండవచ్చు. పరిశ్రమలు, పెట్టుబడులు సాధించేందుకు తోడ్పడి ఉండవచ్చు కదా?పరిశ్రమలు, పెట్టుబడులు ఎవరు సాధించినా అంతిమంగా లబ్ధి కలిగేది తెలంగాణ రాష్ట్రానికే కదా?

అయితే రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి కేవలం 8 నెలలే అయ్యిందని, ఇంత తక్కువ వ్యవధిలోనే ఆయన ఓసారి దావోస్, ఇప్పుడు అమెరికా, దక్షిణ కొరియా దేశాలలో పర్యటించి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించడానికి కృషి చేస్తున్నారనే విషయం కేటీఆర్‌ అండ్ కో పట్టించుకోలేదు.

అలాగే కొత్త ముఖ్యమంత్రి, కొత్త ప్రభుత్వం పనితీరు, విధానాలు ఏవిదంగా ఉన్నాయో తెలుసుకోకుండా ఎవరూ వేలకోట్లు పెట్టుబడులు పెట్టేయరని కేటీఆర్‌కి తెలియనిది కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ రాష్ట్రంలో రాజకీయ సుస్తిరత సాధించి పారిశ్రామిక, ఐ‌టి రంగాల అభివృద్ధికి పాలసీలు ప్రకటించి తమ ప్రభుత్వం వాటికి కట్టుబడి ఉందనే నమ్మకం కలిగించిన తర్వాతే కేటీఆర్‌ విదేశీ పర్యటనలకు మంచి స్పందన వచ్చిందనే విషయం కూడా మరిచిపోయారు.

రేవంత్‌ రెడ్డి అమెరికాలో అడుగుపెట్టగానే పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఐ‌టి కంపెనీలు ఆయన వెంట పడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేస్తారనుకోవడం చాలా అవివేకం, అత్యాశే. ఒక సబ్బు, షాంపూ, బైక్, కారు ఏదైనా వస్తువుని మార్కెట్లో అమ్ముకోవడానికి ఆయా సంస్థలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. అయినా ప్రతీసారి అవి ఫలించవు. అలాగే రేవంత్‌ రెడ్డి బృందం కూడా అమెరికా పర్యటనలో తెలంగాణ రాష్ట్రం… తన ప్రభుత్వం పట్ల పెట్టుబడిదారులలో నమ్మకం కల్పించేందుకు గట్టి ప్రయత్నం చేసిన్నట్లు భావించవచ్చు.

గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్‌ రెడ్డి ఏనాడూ పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడానికి చిన్న ప్రయత్నం కూడా చేయకపోగా రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడేలా, పారిపోయేలా చేయడం అందరూ చూశారు.

కానీ రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ పర్యటనలు చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంటే అభివృద్ధి విషయంలో కేసీఆర్‌, కేటీఆర్‌ వేసిన బాటలోనే ముందుకు సాగుతున్నట్లు స్పష్టం అవుతోంది. అందుకు కేటీఆర్‌ సంతోషించాలి కానీ బాధపడటం తప్పు కదా?

ADVERTISEMENT
Latest Stories