Revanth Reddy said own party leaders conspiring to defeat Congress in by-elections కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీ వారితో సహా చాలా మంది చెప్పుకొనే మాట… కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు… తనని తాను ఓడించుకొన్నప్పుడే ఇతర పార్టీలు గెలుస్తుంటాయని! ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇదే జరుగుతోంది.

ఇదివరకు రేవంత్‌ రెడ్డి టిడిపిలో ఉన్నప్పుడు సిఎం కేసీఆర్‌కు పక్కలో బల్లెంలా ఉండేవారు. కనుక ఓటుకి నోటు కేసులో అడ్డంగా ఇరికించి వేసేశారు.

Also Read – జగన్‌ రాజకీయాల స్టైలే వేరబ్బా!

ఓటుకి నోటు కేసును మహాపరాధంగా భావిస్తున్న వారందరూ మునుగోడు ఉపఎన్నికలలో కోట్ల రూపాయలు వెదజల్లుతూ ఓటర్లను ప్రలోభపెడుతుండటాన్ని నేరంగా భావించకపోవడం విశేషం. ఒక ఎమ్మెల్యే గెలవడానికి కనీసం రూ.2 కోట్లు ఖర్చు చేయవలసివస్తోందని ఆ పార్టీని వీడిన బూర నర్సయ్య గౌడ్‌ మొన్నే చెప్పారు.

రేవంత్‌ రెడ్డిని ఓసారి వేసేసినప్పటికీ ఆయన మళ్ళీ పిసిసి అధ్యక్షుడిగా టిఆర్ఎస్‌, బిజెపిలను సవాలు చేస్తుండటంతో మరోసారి అందరూ కలిసి మునుగోడులో ఆయనను వేసేందుకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం రేవంత్‌ రెడ్డి స్వయంగా కన్నీళ్ళు పెట్టుకొని మరీ చెప్పారు. పార్టీలో తాను ఒంటరివాడినైపోయానని, ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు సొంతపార్టీ నేతలే కుట్రలు పన్నుతున్నారని నిన్ననే చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని ఖాతం చేయడానికి సిఎం కేసీఆర్‌ కేంద్రం వద్ద సుపారీ తీసుకొన్నారని, అందుకే ఢిల్లీలో వారం రోజులు మకాం వేసివచ్చారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

Also Read – నాడూ నేడూ.. జగన్‌ ఫెయిలే?

అయితే రేవంత్‌ రెడ్డిని ఆ పదవిలో నుంచి తప్పించడానికి సొంత పార్టీకే చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుట్ర చేస్తుండటమే విశేషం. ఆయన ఈరోజు తన పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేసి, “తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నాడు తెలుసు కదా? కనుక పార్టీని పట్టించుకోకుండా తమ్ముడికే ఓట్లేసి గెలిపించండి. తర్వాత సంగతి నేను చూసుకొంటాను. మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతే నేను పిసిసి ప్రెసిడెంట్ అవుతాను. అప్పుడు రాష్ట్రంలో పాదయాత్ర చేసి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాను,” అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన ఫోన్‌ సంభాషణ లీక్ అయ్యింది. అంటే మునుగోడు వేదికగా రేవంత్‌ రెడ్డిని వేసేయడానికి సొంత పార్టీకే చెందిన వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్‌, బిజెపి మూడూ సిద్దమయ్యాయన్న మాట!

ఈ ఉపఎన్నికలను టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి గనుక డబ్బు ఖర్చుకి వెనకాడటం లేదు. కనుక మునుగోడు కాంగ్రెస్‌ ఓటమి ఖాయమనే భావించవచ్చు. కాంగ్రెస్‌ ఓడిపోతే రేవంత్‌ రెడ్డిని తప్పించేసి తాను పార్టీ పగ్గాలు చేపడతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందే చెప్పేశారు. కనుక మునుగోడులో అందరూ కలిసి రేవంత్‌ రెడ్డిని మరోసారి వేసేయబోతున్నారని స్పష్టమైపోయింది.

Also Read – అల్లు ను అరెస్టు చేయగలిగారు కానీ ఆర్జీవిని పట్టుకోలేకపోయారు..!