నేడు ఓయూ లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఉద్దేశించి కొన్ని పరోక్ష విమర్శలు చేసారు. హైద్రాబాద్ ఉస్మానియా యూనివర్సిటీని యూకే లోని ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంగా మారుస్తానంటూ హామీ ఇచ్చిన రేవంత్ పనిలో పనిగా స్వకార్యం, స్వామి కార్యం కూడా పూర్తి చేసుకున్నారు.
అందులో భాగంగానే 90 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే తెలంగాణ ఉద్యమాల్లో ఓయూ విద్యార్థుల పాత్ర కీలకమంటూ ప్రశంసిస్తూనే, తెలంగాణ – ఓయూ రెండు అభిభక్త కమలలు అంటూ కొనియాడారు.
ఇటు ఓయూ విద్యార్థుల భవిష్యత్ కు హామీ ఇస్తూనే అటు బిఆర్ఎస్ భవితవ్యాన్ని ఎండగట్టారు రేవంత్. సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఏనుగులున్నాయని, సింహాలున్నాయని అసత్యాలు ప్రచారం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.
రాష్ట్రంలో ఏనుగులు లేవు, సింహాలు లేవు. కేవలం మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయని, అవి కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నాయంటూ పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటైన విమర్శలు చేసారు రేవంత్.
అలాగే ప్రొఫెసర్ కోదండ రామ్ పై కుట్ర రాజకీయం చేసి ఆయన ఎమ్మెల్సీ పదవిని పోయేలా చేసారు. సుప్రీం కోర్టులో కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ పైశాచిక ఆనందాన్ని పొందారని, అటువంటి వారికి చెపుతున్నా మరో 15 రోజులలో కోదండరాం కి మరోసారి ఎమ్మెల్సీ ఇస్తా, ఈసారి ఎవరు అడ్డొస్తారో చూస్తా అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలకు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు రేవంత్.
కోందండరాం కాబట్టి తన ఇంటి తలుపులు పగలకొట్టినా మౌనంగా ఉండిపోయారు అదే నేనైతే అలా చేసిన వారి చెంపలు పగలకొట్టే వారిని అంటూ రేవంత్ విద్యార్థుల ముందు తన దూకుడుతనాన్ని కూడా ప్రదర్శించారు. గత పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన పదునైన మాటలతో ప్రత్యర్థుల నోటికి తాళం వేసేవారు.
కానీ ఒక్క ఓటమి కేసీఆర్ ను మూగవాడిగా మార్చేశాయి అన్నట్టుగా అటు రేవంత్ నుంచి ఇటు కవిత, అలాగే బీజేపీ తనను కానీ తన గులాబీ పార్టీ ని కానీ ఎన్ని విధాలా విమర్శించినా, ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా కేసీఆర్ ఫామ్ హౌస్ గడప దాటడం లేదు, ప్రత్యర్థులకు బదులు చెప్పడం లేదు.
కేసీఆర్ మౌనం తుఫాన్ ముందు నిశ్శబ్దం మాదిరి పార్టీకి బలంగా మారుతుందా.? లేక తుఫాన్ తరువాత విషాదం ను తలపిస్తుందా.?





