తెలంగాణకు రూ.37,870 కోట్ల పెట్టుబడులు… ఆంధ్రకి అవసరమే లేదు!

Revanth Reddy Telangana Investments Davos

ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఐ‌టి రంగం ఒక్కటే లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తోంది. ఒక్క హైదరాబాద్‌ నగరమే యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పోషిస్తోందంటే అతిశయోక్తి కాదు. కనుక ఇంకా పరిశ్రమలు, ఐ‌టి కంపెనీల కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేయకపోయినా నష్టం లేదు.

పైగా రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా స్థిరపడలేదు కూడా. కనుక సిఎం రేవంత్‌ రెడ్డి దావోస్ వెళ్ళకపోయినా ఎవరూ తప్పుపట్టరు.

ADVERTISEMENT

అయినా సిఎం రేవంత్‌ రెడ్డి, ఆ రాష్ట్ర పరిశ్రమలు, ఐ‌టి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, అధికారుల బృందం పెట్టుబడులు సాధించేందుకు దావోస్ వెళ్ళింది. వారి బృందం ఏదో సాధించుకు వస్తుందని ఎవరూ ఆశించడం లేదు. కానీ వారు తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా రూ.37,870 కోట్ల పెట్టుబడులు సాధించారు. వాటిలో అత్యధికంగా అదానీ గ్రూప్, ఇతర భారతీయ కంపెనీలే ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు పెద్దగా లేవు. కనుక ఇటువంటి గొప్ప అవకాశాన్ని చేజార్చుకోకూడదు. కానీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, ఐ‌టి శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఇద్దరూ దావోస్ సదస్సుకి మొహం చాటేశారు.

ఒకవేళ వెళ్ళి ఉంటే వాటిలో కొన్ని కంపెనీలనైనా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించే అవకాశం ఉండేది. కానీ వారికి ఎంత సేపు టికెట్లు, చంద్రబాబు నాయుడు కేసుల గురించే ఆలోచనలు! వైఎస్ షర్మిల వస్తే ఆమెను ఏవిదంగా ఎదుర్కోవాలి?రాష్ట్రంలో కాపు ఓటర్లను ఏవిదంగా ఆకట్టుకోవాలి లేదా విడగొట్టి టిడిపి, జనసేనలను ఏవిదంగా దెబ్బ తీయాలనే ఆలోచనలే తప్ప రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడుల గురించి ఆలోచనే ఉండదు.

అమరావతిని పాడుపెట్టుకొని తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్న జగన్‌ ప్రభుత్వం, దావోస్ సదస్సుకి మొహం చాటేసి ఇంకా తోడ్పడుతోంది.

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పుడే పరిశ్రమలు, పెట్టుబడుల గురించి ప్రయత్నిస్తోంది. కనుక జగన్‌ ప్రభుత్వ నిర్లిప్తతని కూడా రేవంత్‌ ప్రభుత్వం మంచి అవకాశంగా మలుచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం ఖాయమే. ఏపీలో మరోసారి వైసీపి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఇక తిరుగు ఉండదు.

ADVERTISEMENT
Latest Stories