పీరియడ్ డ్రామాగా రూపొందుతున్న “పద్మావతి” చిత్రం షూటింగ్‌లో మరోసారి దాడి జరిగింది. ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ ఆ సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై ఇటీవలే జైపూర్‌లోని జైగఢ్ కోటలో దాడిచేసిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని రోజులు వాయిదా పడ్డ సినిమా షూటింగ్ ప్రస్తుతం మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో తిరిగి ప్రారంభమైంది.
అయితే ఇక్కడ వేసిన భారీ సెట్స్ పై కొందరు దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. దీంతో సినిమా కోసం వేసిన సెట్స్ పూర్తిగా కాలిపోగా, ఈ దాడిలో ఎవరికీ గాయపడకపోవడం ఊరటనిచ్చే అంశం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాణి పద్మావతిగా దీపికా పదుకొనే, అల్లావుద్దీన్ ఖిల్జీగా నెగటివ్ రోల్ లో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు.
ఈ దాడిని సంచలన దర్శకుడు వర్మ సైతం ఖండించారు. తమకు అంతా తెలుసని భావిస్తూ ఈ దాడులకు పాల్పడుతున్న వారంతా, సంజయ్ లీలా భన్సాలికి తెలిసిన దాంట్లో కనీసం 1 శాతం కూడా తెలియదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని “సర్కార్ 3” ప్రమోషన్స్ కోసం వర్మ చక్కగా వినియోగించు కుంటున్నారని నెటిజన్ల టాక్.



