వేచి చూసింది చాలు… జాగో టిడిపి…జాగో!

TDPఏపీలో బిజెపికి పెద్దగా బలం, బలగం, ప్రజాధారణ లేనప్పటికీ రాష్ట్ర రాజకీయాలను శాసించగలుగుతోందంటే కేంద్రంలో అధికారంలో ఉండటమే కారణమని అందరికీ తెలుసు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడుని మార్చినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు కానీ ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజును మార్చి ఆయన స్థానంలో దగ్గుబాటి పురందేశ్వరిని నియమించడంపై పెద్ద చర్చే మొదలైంది. కారణం అదే!

ఈ మార్పు ద్వారా టిడిపితో పొత్తులకు తమకు ఆసక్తిలేదని బిజెపి చాలా స్పష్టమైన సంకేతమే ఇచ్చిందని భావించవచ్చు. టిడిపి, వైసీపీలకి తాము సమానదూరమని బిజెపి చెపుతున్నప్పటికీ దాని మనసులో జగన్మోహన్ రెడ్డికి చోటు ఉందని అందరికీ తెలుసు. నేడు జగన్‌ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ విషయం మరోసారి బయటఓపడుతుంది కూడా. కనుక ఏపీలో పార్టీల బలహీనతలు, ఏపీలో పరిస్థితులనే బలంగా మార్చుకొని రాజకీయాలు చేస్తున్న బిజెపికి టిడిపి కూడా గుడ్ బై చెప్పేసి ఇక యుద్ధరంగంలో దిగడమే మంచిది.

ADVERTISEMENT

మినీ మ్యానిఫెస్టో ప్రకటన, నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులను ఖరారు చేస్తుండటం ద్వారా చంద్రబాబు నాయుడు కూడా అదే సూచిస్తున్నారనుకోవచ్చు. అయితే ఢిల్లీ పెద్దల ఆశీర్వాదాలు, తెర వెనుక నుంచి తెలంగాణ సిఎం కేసీఆర్‌ సహాయసహకారాలు పొందుతున్న జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే టిడిపికి ఈ స్పీడు సరిపోదు. మరింత దూకుడుగా వ్యవహరించగలిగితేనే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.

వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మేమే గెలుచుకొంటామని సిఎం జగన్మోహన్ రెడ్డి పదేపదే చెపుతున్నది కూడా ప్రజలకు అటువంటి నమ్మకం కలిగించడానికే తప్ప నిజంగా గెలుస్తామని కాదు. ప్రజలకు ఆ నమ్మకం కలిగించగలిగితే చాలు… ఇక ప్రభంజనమే.

కనుక టిడిపి కూడా ఎదురుచూపులు, మెతక వైఖరికి స్వస్తి పలికి మరింత దూకుడుగా వ్యవహరిస్తూ, ఇలాంటి అనైతిక, అరాచక రాజకీయ వాతావరణంలో కూడా వైసీపీని ఎదుర్కొని ఓడించగలమని నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. అందుకోసం మరింత దూకుడుగా వ్యవహరించవలసి ఉంటుంది. కాదని ఇంకా బిజెపి, జనసేనల వైపు చూస్తూ మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోంటే జరగకూడని నష్టం జరిగిపోతుంది. అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు. కనుక టిడిపి సర్వశక్తులు కూడగట్టుకొని పోరాటానికి సిద్దం కావలసిందే. లేకుంటే టిడిపి, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా తీవ్రంగా నష్టపోవడం ఖాయం.

ADVERTISEMENT
Latest Stories