కేవలం 251కి స్మార్ట్ ఫోన్ ను అందించేందుకు తామెంతో నష్టపోయామని ‘రింగింగ్ బెల్స్’ చీఫ్ మోహిత్ కుమార్ గోయల్ ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేసారు. ఫోన్ల డెలివరీని ప్రారంభించామని, తొలి రోజున 5 వేల ఫోన్లను డెలివరీ చేయనున్నామని, మొత్తంగా తమ వద్ద మొత్తం 2 లక్షల యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని, వీటిని డెలివరీ చేస్తే 23 కోట్ల సబ్సిడీ భారాన్ని భరించాల్సి వుందని తెలిపారు.
తానెన్నడూ లాభాలను ఆర్జించలేదని, తన సంస్థలో 33 శాతం వాటాలను విక్రయించిన తరువాతనే ‘ఫ్రీడమ్ 251’ ఫోన్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయగలిగామని తెలిపారు. హరిద్వార్ లో థర్డ్ పార్టీ మాన్యుఫాక్చరర్ గా సచ్చిదానంద్ ఎంటర్ ప్రైజస్ ను ప్రారంభించి, ఫోన్ల తయారీ చేపట్టినట్టు తెలిపారు. మార్కెట్ నిపుణుల లెక్కల ప్రకారం, ‘ఫ్రీడమ్ 251’కు వాడిన పరికరాల ఖరీదు 1,180 రూపాయలుగా ఉండవచ్చని, ఈ లెక్కన 251 రూపాయలకే ఫోన్ ఇవ్వడం వల్ల ఒక్కో ఫోన్ పై దాదాపు 920 రూపాయల నష్టాన్ని సంస్థ భరిస్తుందని అంచనా వేస్తున్నారు.
మొత్తానికి మార్కెట్ లోకి అయితే 251 రూపాయల మొబైల్ ఆగమనం జరిగింది. ఇక వినియోగదారుల సమీక్షలపై టెక్ ప్రియుల ఆసక్తికరమైన చూపులు. సంస్థకు ఎంత నష్టం వచ్చినా, ఎంత లాభం వచ్చినా వినియోగదారుని పరిధిలో లేని విషయం గనుక, కస్టమర్ రీత్యా లాభనష్టాల ప్రస్తావన అవసరం లేదు. కేవలం అతి తక్కువ ధరకు లభ్యమవుతున్న స్మార్ట్ ఫోన్ నాణ్యత ఎలా ఉందన్న దానిపై మాత్రం అందరి ఆసక్తి నెలకొంది.



