వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేవో తెలియజేస్తూ టీడీపీ, జనసేనలు ఫోటోలు, వీడియోలతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండేవి. ఇప్పుడు అవే అధికారంలో ఉన్నాయి కనుక రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మెరుగు పడుతుందని ఆశించడం అత్యాశ కాబోదు.
కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం చుట్టూ ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే రోడ్లన్నీ నేటికీ అలాగే ఉన్నాయి. గుంతలు పడిన ఆ రోడ్లపై ప్రయాణించలేక ప్రజలు, పర్యాటకులు నానా బాధలు పడుతున్నారు.
ఇక రాష్ట్రంలో నగరాలు, పట్టణాలలో కూడా రోడ్ల పరిస్థితి ఇంకా మెరుగుపడనే లేదు. సంక్రాంతిలోగా గుంతలన్నీ పూడ్చేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పడమే కాకుండా వాటి కోసం సుమారు రూ.3,000 కోట్లు విడుదల చేశారు కూడా. కనుక సంక్రాంతిలోగా రోడ్లన్నీ బాగుపడతాయని ఆశిద్దాము.
జగన్ హయంలో తీవ్ర నిరాధరణకు గురైన రంగాలలో పర్యాటక రంగం కూడా ఒకటి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానికి ప్రాధాన్యత ఇస్తోంది. అయితే దాని ఆలోచనలు ఎప్పుడు కార్యరూపంలోకి వస్తాయో తెలీదు.
విశాఖ నగరంలో ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రమైన ఆర్‌కే బీచ్ వద్ద అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోతకు గురయ్యి బీచ్ ఒడ్డున గల గోకుల్ పార్క్ ప్రహారీగోడ కూలిపోయింది.
ఆర్‌కే బీచ్ కోతకు గురికావడం ఇదేమీ మొదటిసారి కాదు. గత ఏడాది బీచ్ ఒడ్డున గల కురుసుర సబ్ మెరైన్ గోడ వరకు కోతకు గురైనప్పుడు బీచ్ రోడ్డు పాక్షికంగా కూలిపోయింది. ఇది ఒక్క విశాఖ బీచ్ సమస్య మాత్రమే కాదు రాష్ట్రంలో పలు సముద్రతీరాల వద్ద ప్రాంతాలు ఇలాగే కోతకు గురవుతున్నాయి.
పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ముందుగా ఇటువంటి ప్రధానమైన పర్యాటక కేంద్రాలపై దృష్టి సారించి శాశ్విత ప్రతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి గతంలో జగన్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపి విమర్శించినప్పుడు, ఇప్పుడు వైసీపీ కూడా వేలెత్తి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే వరకు జాప్యం చేయకూడదు కదా?




