జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో కలిసి మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిసి రెండు రోజులవుతున్నా వారిరువురూ ఇంకా ఢిల్లీలోనే మకాం వేసి వరుసగా బిజెపి పెద్దలతో భేటీ అవుతున్నారు. బుదవారం కేంద్రమంత్రులు అమిత్ షా, మురళీధరన్‌లతో భేటీ అయ్యి సుదీర్గంగా చర్చించారు. గురువారం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.
బిజెపి-జనసేన మిత్రపక్షాలు కనుక పొత్తుల గురించి తప్పకుండా వారు చర్చించుకొనే ఉంటారు. పొత్తుల గురించి మాట్లాడుకొన్నప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, బలాబలాల గురించి వాటితో పాటు ప్రతిపక్షాలపై వైసీపీ దాడులు, దౌర్జన్యాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరుగుతున్న అనర్ధాలు వగైరా అన్నిటి గురించి వారు బిజెపి పెద్దలకు చెప్పకుండా ఉండరు.
అందుకే మంత్రి రోజా తదితరులు అప్పుడే వారిపై విషం కక్కుతున్నారు. టిడిపిని కూడా కలుపుకుపోదామని బిజెపి పెద్దలకు నచ్చజెప్పేందుకు పవన్ కళ్యాణ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, ఏదోవిదంగా మూడు పార్టీలను కలిపి, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసేందుకు పవన్ కళ్యాణ్ ఆరాటపడుతున్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు తరపున ఓ రాజకీయ బ్రోకరుగా పనిచేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
వైసీపీ నేతల విమర్శలు వారి ఆందోళనకు అద్దం పడుతున్నాయని చెపొచ్చు. ఎందుకంటే, టిడిపి-జనసేనలు కలిస్తేనే వాటి చేతిలో ఓడిపోతామని ఆందోళన చెందుతున్న వైసీపీ నేతలు, వాటితో బిజెపి కూడా చేయి కలిపితే తమకు గడ్డు పరిస్థితి ఎదురవుతుందని బాగానే గ్రహించారు కనుక.
టిడిపితో పొత్తులకు బిజెపి అయిష్టంగా ఉందని తెలిసి ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఒత్తిడికి తలొగ్గి బిజెపి ఎక్కడ టిడిపితో పొత్తులకు సిద్దపడుతుందో అని వైసీపీ తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు అర్దమవుతోంది. అందుకే ఈ ఆక్రోశం.
అయితే వైసీపీ కోరుకొన్నట్లు ప్రతిపక్షాలు నడుచుకొనేమాటైతే రాష్ట్రంలో ప్రతిపక్షాలే అవసరం లేదు కదా?అయినా టిడిపి, జనసేన కోరుకొంటున్నట్లుగా వైసీపీ పనిచేస్తుందా? చేయదు కదా? మరి అలాంటప్పుడు టిడిపి, జనసేనలు తమకు నష్టం కలిగించకుండా వచ్చి తాము ఏర్పాటు చేసిన బోనులో కూర్చోవాలని ఎలా ఆశిస్తోంది?



