ఢిల్లీ భోగట్టా – జగన్ పై కేసులన్నీ హుష్ కాకి?

YS Jagan Casesతెలుగుదేశం పార్టీ ఇక తమతో ఉండబోదని అర్థం చేసుకున్న బీజేపీ పెద్దలు, ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైపు చూస్తున్నారా? ఢిల్లీలో మొదలైన కొత్త ప్రచారాన్ని గురించి వింటుంటే అది నిజమే అనిపిస్తోంది. బీజేపీకి – జగన్ కు మధ్య ఓ అవగాహన కుదిర్చేందుకు ప్రముఖ వ్యాపార సంస్థతో పాటు జాతీయ స్థాయిలో ప్రాబల్యమున్న కొన్ని రాజకీయ శక్తులు కూడా రంగంలోకి దిగాయని సమాచారం.

ADVERTISEMENT

జగన్ తో తమకు ఎలాంటి సీక్రెట్ డీల్ లేదని, టీడీపీ వారు అనవసరంగా అపోహ పడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కంటితుడుపు వ్యాఖ్యలు చేసినప్పటికీ, పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తున్న వైనం తెలిసిందే. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి, అమిత్, మోడీలతో పలుమార్లు సమావేశమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు జగన్ పై పెట్టిన కేసుల్లో క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు, సీబీఐ చర్యల నిలుపుదల, జగన్ రాజకీయంగా ఎదిగేందుకు సహకరించడం వంటి ప్రయోజనాలను ఎన్డీయే సర్కారు అందిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా, జగతి పబ్లికేషన్స్ కు చెందిన 34.6 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ల జప్తు విషయంలో ఈడీ అపిలేట్ అథారిటీ క్లీన్ చిట్ ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇదే సమయంలో ఏకే దండమూడి, టీఆర్ కన్నన్, మాధవ్ రామచంద్రన్ తదితరుల నుంచి మనీలాండరింగ్ కింద గతంలో సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేయగా, ఇందుకు క్విడ్ ప్రోకో లేదని కూడా క్లీన్ చిట్ లభించింది. ఇదిలావుండగా, జగన్ పై ఉన్న కేసుల్లో వేగాన్ని తగ్గించాలని పై నుంచి తమకు ఆదేశాలు వస్తున్నాయని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఈడీ అధికారులు అంటున్నారు.

నైతికంగా జగన్ కు సహకరించాలన్నదే బీజేపీ ఉద్దేశమని, ఆపై ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తే, తమకూ లాభమేనని బీజేపీ అంచనా వేస్తోందని రాజకీయ పండితులు కూడా గత కొన్ని నెలలుగా విశ్లేషణలు చేస్తున్నారు. నిజానికి టిడిపిని వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే ‘పొమ్మనలేక పొగపెట్టినట్లుగా’ బిజెపి వ్యవహరించిందనే న్యూస్ కూడా జాతీయ స్థాయిలో హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories