క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చకచకా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ … బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించనున్నారు. ఎన్టీఆర్ బాల్యం, సినీరంగ ప్రవేశం, రాజకీయ రంగప్రవేశం… ఇవన్నీ కలుపుకుంటే ఈ సినిమా నిడివి చాలా ఎక్కువగా వుంటుందనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారనే ప్రచారం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే.
ఒక భాగాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి, మరో భాగాన్ని 2019 మధ్య భాగంలో విడుదల చేయనున్నట్టు వచ్చిన వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తాజాగా తేలింది. ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేననీ, ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందడం లేదనేది ప్రాజెక్టు నిర్వాహకుల వైపు నుంచి వినిపిస్తోన్న మాట. ఎన్టీఆర్ బయోపిక్ మొత్తం ఒక సినిమాగానే ఉంటుందనీ, జూలై 5వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
రిలీజ్ డేట్ విషయంలో కూడా అనేక పుకార్లు షికార్లు చేసాయి. జనవరి 9వ తేదీన రిలీజ్ అనుకున్నప్పటికీ, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నందున సంక్రాంతికి రిలీజ్ కాకపోవచ్చని ప్రచారం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితులలోనూ సంక్రాంతికి విడుదల అవుతుందని తెలియడంతో నందమూరి అభిమానులు ఖుషీగా ఉన్నారు. మొత్తమ్మీద పుకార్లకు నిలయంగా ఎన్టీఆర్ బయోపిక్ నిలుస్తోంది. అయితే ఇంకా క్లారిటీ రావాల్సిన అంశాలు ఈ సినిమాపై చాలానే ఉన్నాయి.



