మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న “ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ” సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యధిక స్క్రీన్లలో ప్రదర్శితమవుతోన్న సినిమాగా ఇప్పటికే రికార్డుల బోణి చేసిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. మెగా వారసుడు రామ్ చరణ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసాడన్న టాక్ వినపడుతోంది.
ధోని క్రికెట్ కెరీర్ లో సురేశ్ రైనా పాత్ర కూడా కీలకం అన్న విషయం క్రికెట్ ప్రేమికులకు తెలిసిందే. టీమిండియాతో పాటు ‘చెన్నై సూపర్ కింగ్స్’ జట్టు తరపున కూడా ధోనికి రైనా అండదండగా ఉండడంతో, ఈ సినిమాలో రైనా పాత్ర ఎవరు పోషించారు? అన్న ప్రశ్నకు సమాధానమే ‘రామ్ చరణ్’ పేరు తెరపైకి తెచ్చింది. రైనా పాత్రలో రామ్ చరణ్ ను, విరాట్ కోహ్లి పాత్రలో ఫవాద్ ఖాన్ లు అతిథి పాత్రలు పోషించారని, వీరిద్దరిని సర్ ప్రైజ్ ప్యాకేజ్ క్రింద చూపించడానికే ట్రైలర్లలో సైతం చూపించలేదని హల్చల్ చేస్తున్న సమాచారంలో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
అయితే, ఈ వార్తలు నిజమైతే తెలుగునాట “ధోని” సినిమాకు ‘మెగా అభిమానుల’ ఆదరణ పుష్కలంగా లభించినట్లే. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ‘మజ్ను’ తప్ప మరొక సినిమా లేకపోవడంతో, ఈ ‘ధోని’కి పాజిటివ్ టాక్ వస్తే… మంచి కలెక్షన్స్ కొల్లగొట్టవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీనికి రామ్ చరణ్ చరిష్మా తోడయితే… అది ఓ రేంజ్ కు వెళ్ళడం ఖాయమని అంచనా. హిందీలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళ భాషలో కూడా విడుదల చేస్తున్నారు. ఇటీవలే రాజమౌళి చేతుల మీదుగా ఆడియో విడుదల కావడంతో, పబ్లిసిటీ పరంగా కూడా ఎక్కడా లోటు లేకుండా పోయింది.



