టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తమ్ముడిగా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన సాయిరామ్ శంకర్, సక్సెస్ కోసం దండయాత్ర సాగిస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు ఎదురురాని విజయం, తాజాగా విడుదల అవుతోన్న “నేనోరకం” సినిమా ద్వారా వస్తుందని భావిస్తున్న సాయి, ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సోదరుడు పూరీ జగన్నాధ్ తో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తనకు, పూరీకి మధ్య మరో సోదరుడు ఉన్నాడని, అందువలన మా ఇద్దరికీ వయసులో చాలా వ్యత్యాసం ఉందని చెప్పిన సాయి, ఇప్పటివరకు తామిద్దరి మధ్య జరిగిన సంభాషణలు లెక్కలో తీసుకుంటే కేవలం ఓ మూడు, నాలుగు గంటలు మాత్రమే ఉంటుందని, అన్నయ్య ఎక్కువ జోవియల్ గా ఉంటాడని, తను మాత్రం అప్పట్లో చాలా మూడీగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. తనను ఒక ఆర్టిస్ట్ గా చూడాలనేది తన తండ్రి కోరిక కావడంతో, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోన్న తనను ‘ఇడియట్’లో ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారా నటుడిగా పరిచయం చేసారని అన్నారు.
అలాగే ఆ తర్వాత ‘143’ సినిమాతో హీరోగా చేసారని, అడిగితే ఇప్పటికైనా అన్నయ్య లక్షలు, కోట్లు పెట్టి సినిమా తీస్తారు, అయితే నాకున్న మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా… అంటూ బదులిచ్చారు. పెద్ద హీరోలతో పెద్ద పెద్ద సినిమాలు చేసే అన్నయ్యను నాతో సినిమా చేయడమనడం సమంజసం కాదని, అయితే అన్నయ్య అందించిన కధలతోనే ‘రోమియో’ వంటి కొన్ని సినిమాలు చేసానని, ప్రస్తుతం కొత్త దర్శకులతో సరికొత్త సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు సాయి.



