వైసీపీ మళ్ళీ అదే ఐడియా… ఈసీకి ఎదురు ఫిర్యాదు

Sajjala Ramakrishna Reddyవైసీపీ నేతలందరూ ఎంతో నీతి,నిజాయితీపరులన్నట్లు, ప్రజల సంక్షేమానికే అంకితమైపోయిన్నట్లు మాట్లాడుతుంటే ఎవరికైనా నవ్వొస్తుంది. వారు మాటలకు, చేతలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని వారే పలుమార్లు స్వయంగా నిరూపించుకొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా యాత్రలకు వెళ్తే దాడులు చేశారు. అమరావతి రైతులు అరసవిల్లికి పాదయాత్రకు బయలుదేరితే వారిని ముందుకు సాగనీయకుండా అడ్డుకొన్నారు. నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ల గురించి ఎంత నీచంగా మాట్లాడుతారో అందరూ వింటూనే ఉన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలకు మేలు చేశామని చెప్పుకోవడం సిఎం జగన్‌కే చెల్లు.

ADVERTISEMENT

వైసీపీ ప్రభుత్వం అంత భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పుడు, పరిపాలన, రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టి ఉంటే నేడు పవన్‌ కళ్యాణ్‌ చూసి ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే 2024లో ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా రకరకాల వ్యూహాలు అమలుచేస్తూ, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు.

ఆ వ్యూహాలలో భాగమే భారీగా టిడిపి సానుభూతిపరుల ఓట్ల తొలగించి ఆ స్థానంలో దొంగ ఓటర్లను నమోదు చేయించడం. తమ ప్రభుత్వం ఎంతో నీతి నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తూ వారి అభిమాన్ని పొందామని వైసీపీ నేతలు చెప్పుకొంటున్నప్పుడు, మళ్ళీ ఈ ఓటర్ల జాబితాలు తారుమారు చేయడం ఎందుకు చేస్తునట్లు?అంటే వారి మాటలపై వారికే నమ్మకం లేదనే కదా?

అయితే ఇటువంటి దురాలోచనలు చేస్తుంటే ప్రతిపక్షాలు కనిపెట్టలేవని, ఒకవేళ కనిపెట్టినా చేతులు ముడుచుకొని కూర్చోంటాయని వైసీపీ నేతలు ఎలా భావించారో తెలీదు కానీ, టిడిపి నేత పయ్యావుల కేశవ్ ఫిర్యాదులపై ఈసీ స్పందించి, ఈ ఓటర్ల గోల్‌మాల్‌ వ్యవహారంపై విచారణకు ఆదేశించేసరికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎప్పటిలాగే మీడియా ముందుకు వచ్చి పెడబొబ్బలు పెడుతూ, దీనికీ టిడిపినే నిందించడం విశేషం.

గత ఎన్నికలకు ముందు టిడిపియే భారీగా దొంగ ఓట్లను నమోదు చేయించిందని, వాటినే తాము గుర్తించి తొలగిస్తున్నామని వితండవాదం చేశారు. ఒకవేళ సజ్జల వాదనే సరైనదనుకొంటే, దొంగ ఓట్లు నమోదు చేయించిన టిడిపి 2019 ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలవాలి కదా? కానీ టిడిపి ఘోరంగా ఓడిపోయి వైసీపీ భారీ మెజార్టీతో గెలిచిందిగా… ఇదెలా సాధ్యం?

జగన్ ప్రభుత్వానికి మొదటి నుంచి సజ్జల శల్య సారధ్యమే చేస్తున్నారు. ఓటర్ల జాబితాల తారుమారు చేయడం కూడా ఆయన సలహాయే కాదో తెలీదు కానీ ఈ సలహా ఎవరు ఇచ్చినా అది వైసీపీ కొంప ముంచబోతోంది.

చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి ఈసీని, అమిత్‌ షాలని కలిసి ఏపీలో ఓటర్ల జాబితాల గోల్‌మాల్‌ వ్యవహారంపై ఫిర్యాదు చేయబోతున్నారని తెలియగానే ఆయన కంటే ముందు వైసీపీ ఎంపీలు ఈసీని కలిసి టిడిపి మీద ఫిర్యాదు చేయబోతున్నారు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఓటర్ల జాబితాలలో ఎటువంటి అవకతవకలకు పాల్పడకపోతే ఇంత కంగారు పడవలసిన అవసరం లేదు కదా?

ఈసీ అధికారులను పంపించి విచారణ జరుపుకోవచ్చని సవాలు విసిరి ఉండొచ్చు కదా?కానీ చంద్రబాబు నాయుడు కంటే ముందు ఈసీని కలవాలనుకోవడం గమనిస్తే దీనిని వైసీపీ ఎంతగా ఆందోళన చెందుతోందో అర్దంచేసుకోవచ్చు. అయితే తప్పుడు ఆలోచనలు చేసేవారికి, తప్పుడు మార్గాలలో ప్రయాణించేవారికి తాత్కాలికంగా విజయం లభించవచ్చేమో కానీ చివరికి ఎదురుదెబ్బలు, ఓటమి తప్పవు.

ADVERTISEMENT
Latest Stories