సజ్జల మళ్ళీ తీర్పు చెప్పేశారు… ఎవరైనా వింటున్నారా?

Sajjala Ramakrishna Reddyవివేకా హత్యకు ఖచ్చితంగా రాజకీయ కారణాలు కనబడుతున్నట్లే ఈ కేసు విచారణపై కూడా రాజకీయ ఒత్తిళ్ళు వాటి ప్రభావం అంతే ఉంది. ఈ కేసును హైదరాబాద్‌ బదిలీ చేసినప్పటికీ, సుప్రీంకోర్టు జూన్ 30 వరకు గడవు విధించినప్పటికీ సీబీఐ విచారణ పూర్తిచేయలేకపోవడమే ఇందుకు నిదర్శనం.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి కంటే వైసీపీ నేతలు, వారి మీడియాయే ఎక్కువ మాట్లాడుతుండటం ఆలోచించవలసిన విషయమే అనిపిస్తుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఓ ఎంపీ, జగన్‌కు వరుసకు సోదరుడు మాత్రమే. సొంత తల్లిని, చెల్లిని కాదనుకొన్నప్పుడు అవినాష్ రెడ్డి గురించి ఎందుకు ఇంతగా తాపత్రయపడుతున్నట్లు?

ADVERTISEMENT

జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు మళ్ళీ మీడియా సమావేశం పెట్టి ఈ కేసు గురించి మాట్లాడారు. “ఇదంతా చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో సీబీఐ కల్పిత స్టోరీ మాత్రమే. అసలు వివేకా హత్య వలన ఎవరికి ఎక్కువ నష్టం కలుగుతుంది?అని అడిగితే రాష్ట్రంలో చంటిపిల్లాడు కూడా సమాధానం చెప్పగలడు.

ఇలాంటి కేసును పట్టుకొని సీబీఐ చంద్రబాబు నాయుడు చెప్పిన్నట్లు ముందుకు సాగిపోతోంది తప్ప వివేకాను హంతకులను పట్టుకోవాలని ప్రయత్నించడం లేదు. ఇంతవరకు సీబీఐ ఇప్పించిన స్టేట్‌మెంట్స్ అన్ని చంద్రబాబు నాయుడుకి అనుకూలంగానే ఉన్నాయి.

అవినాష్ రెడ్డి ఇటీవల సీబీఐకి లేఖ వ్రాయగానే వెంటనే సునీతా రెడ్డి చేత సీబీఐ స్టేట్‌మెంట్‌ ఇప్పించింది. ఆమె చెప్పినవన్నీ అబద్దాలే. ఆ అబద్దాల ఆధారంగా సీబీఐ చెపుతున్నది ఇంకా పెద్ద అబద్దమే,” అని సజ్జల రామకృష్ణారెడ్డి తన అమూల్యమైన అభిప్రాయాన్ని లేదా ఈ కేసులో తీర్పుని చెప్పేశారు.

అవినాష్ రెడ్డి ఇటీవల సీబీఐకి లేఖ వ్రాయగానే వెంటనే సునీతా రెడ్డి చేత సీబీఐ స్టేట్‌మెంట్‌ ఇప్పించిందని సజ్జల వాదిస్తున్నప్పుడు, ఆమె, వైఎస్ షర్మిల ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌తో ఈ కేసులో ఏదో జరుగబోతోందనే ఆందోళనతోనే ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఈ వాదనలు వినిపిస్తున్నట్లు భావించవచ్చు కదా?

అసలు ఇన్ని చెప్పేబదులు వివేకాని ఎవరు హత్య చేశారో ఆయనే చెప్పేస్తే సరిపోతుంది కదా?వివేకా హత్య వలన ఎవరికి నష్టం కలుగుతుంది? అనే ప్రశ్నకు ‘సునీతారెడ్డికే’ అని ఆయనకు తెలియదా?అందుకే ఆమె ఇంత శక్తివంతమైన వైసీపీ నేతలను ఎదిరించి ఒంటరిగా న్యాయపోరాటం చేస్తున్నారు కదా?

చంద్రబాబు నాయుడు కనుసన్నలలో సీబీఐ పనిచేసే మాటయితే ఆయన తాను కోరుకొన్నవారందరినీ ఎప్పుడో లోపల వేయించేసేవారు కదా?అసలు సీబీఐ దర్యాప్తును ఎవరు ప్రభావితం చేస్తున్నారో రాష్ట్రంలో అందరికీ తెలుసు. అసలు ఈ కేసుతో సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం?ఆయన ప్రెస్‌మీట్‌లు పెట్టి ఎందుకు ఈవిదంగా తన వాదనలు వినిపిస్తున్నారు?వాటితో ఆయన ఎవరిని మెప్పించాలనుకొంటున్నారు?ఎవరిని ప్రభావితం చేయాలనుకొంటున్నారు?

ఒకవేళ సీబీఐకి ఈ కేసు దర్యాప్తు చేయడం చాతకాదని ఆయన భావిస్తున్నట్లయితే హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో పిటిషన్‌ వేసి తన వాదనలు వినిపించవచ్చు కదా?ఇంత న్యాయ పరిజ్ఞానాన్ని ప్రెస్‌మీట్‌లో వృధా చేసుకోవడం ఎందుకు?

ADVERTISEMENT
Latest Stories