చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం విదేశాల నుంచి హైదరాబాద్ తిరిగి రాగానే తన నివాసం నుంచే టిడిపి ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి పోలింగ్ తర్వాత పరిస్థితులు, పరిణామాలపై చర్చించారు.
ఈ నెల 31న విజయవాడలో 175/25 శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన ఎలక్షన్ ఏజంట్లతో సమావేశం అయ్యేందుకు, మర్నాడు (జూన్ 1) నుంచి జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజంట్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు.
ఈ విషయంలో టిడిపి కంటే వైసీపి కాస్త ముందుందని చెప్పాలి. సజ్జల రామకృష్ణా రెడ్డి ఈరోజు విజయవాడలో వైసీపి కౌంటింగ్‌లో ఏజంట్లతో సమావేశం నిర్వహించారు.
వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఈసీ మన పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటే ఈసీ ఆయనకే వత్తాసు పలుకుతోంది.
కౌంటింగ్‌లో కూడా టిడిపి ఏజంట్లు అవకతవకలకు పాల్పడే ఆవకాశం ఉంది కనుక మీరందరూ వారిని నిశితంగా గమనిస్తూ ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే అడ్డుకోవాలి. మీ అందరికీ ఒకటే మాట చెపుతున్నాను. ఈ ఎన్నికలలో గెలిచేది మనమే. జూన్ 9న జగన్ విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ నమ్మకంతోనే మీరందరూ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి,” అని చెప్పారు.
కౌంటింగ్‌లో రసాభాస జరుగుతుందని వైసీపి ఎమ్మెల్యే పేర్ని నాని ముందే చెప్పేశారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ‘రాష్ట్రంలో మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనే నమ్మకంతో’ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొని టిడిపి ఏజంట్లను అడ్డుకోవాలని నొక్కి చెప్పడం చూస్తే, రసాభాస చేయమని సూచిస్తున్నట్లే ఉంది.
వైసీపి నేతలు ఇంత బహిరంగంగా కౌంటింగ్‌లో ఏదో అనర్ధం జరుగబోతోందని పదేపదే చెపుతున్నందున, రాష్ట్ర ఎన్నికల సంఘం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. టిడిపి కూడా తమ ఏజంట్లకు వైసీపి చేయబోయే కుట్రల పట్ల అవగాహన కల్పించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమే.
కౌంటింగ్‌లో రసాభాస జరగడం వైసీపికి ఎంత అవసరమో, కౌంటింగ్ సజావుగా జరగడం టిడిపికి అంతే అవసరం. లేకుంటే ఈ 5 ఏళ్ళ పోరాటాలు, పొత్తులు, ఎన్నికల ప్రచారం, నేతలు, కార్యకర్తల త్యాగాలు అన్నీ వృధా అయిపోతాయి.




