రాజకీయాలలో ‘గెలుపు’ బాధ్యతను గుర్తు చేయాలి, ఓటమి ‘సమీక్ష’ను కోరుకోవాలి. ఓటమికి గల అన్ని కారణాలను విశ్లేషించి వాటిపై సమీక్షలు జరిపి వాటిని పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకుడి మీదే ఉంటుంది.
అయితే ఏపీ రాజకీయాలలోకి కెరటం లా 151 సీట్లతో ముందుకు దూసుకొచ్చిన వైసీపీ అంతే వేగంగా 11 సీట్లతో వెనక్కి వెళ్ళింది. అయితే విజయానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా జగన్ ఓటమికి మాత్రం ఖచ్ఛితంగా కారణాలు వెతకాలి.
2024 ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగాలు, సాక్షి కథనాలు అన్నింటిని ఛీ కొట్టిన ప్రజలు కూటమికి పట్టం కట్టారు. అయితే ఈ విషయాన్ని సాక్షి మీడియా కానీ జగన్ కానీ ఇప్పటికి అర్ధం చేసుకోలేకపోతున్నారు వై? కేవలం వైసీపీ పార్టీ మద్దతుదారులు మాత్రమే సాక్షి కథనాలను, జగన్ ప్రసంగాలను విశ్వసించారు. పోను పోను వారు కూడా సాక్షిగా దూరంగా జగన్ కు వ్యతిరేకంగా మారిపోవడం ఖాయంగా కనపడుతుంది.
సాక్షి ప్రచారాలను, జగన్ ప్రసంగాలను సామాన్య ఓటర్ పరిగణలోకి తీసుకోలేదు కాబట్టే వైసీపీ ని 11 సీట్లతో కట్టడి చేసారు. అయినా వీరిద్దరి వ్యవహార శైలిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. అవే తప్పుడు ప్రచారాలు, అవే తప్పుడు ఆరోపణలు. నేరం తాము చేసి నింద వేరొకరి మీద రుద్దడమే సాక్షి మీడియా విలువలు, జగన్ విశ్వసనీయత.
గడిచిన నలభై రోజులలో ఆంధ్రప్రదేశ్ రావణకాష్టంగా మారిపోయిందని, కూటమి ప్రభుత్వం అరాచకాలకు అడ్డాగా మారిపోయిందని, బాబు అంగీకారంతో లోకేష్ ఆదేశాలతో రాష్ట్రంలో నరమేథం జరుగుతుందని సాక్షిలో రాసే రాతలు మారలేదు, పిన్నెల్లి, అవినాష్, అనంతబాబు వంటి నేతలను సౌమ్యులు, మంచి వారు అంటూ జగన్ నోటపలికే మాటలు మారడం లేదు.
కేవలం తన పార్టీ ఉనికి కోసం, తన అస్తిత్వం కోసం రాష్ట్ర ప్రతిష్టను ఢిల్లీ విధులలో నిలబెట్టారు జగన్. అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలను బజారులో మాట్లాడం, బజారులో మాట్లాడుకునే భాషను సాక్షిలో మాట్లాడడం వైసీపీకి అలవాటుగా మారిపోయింది. విలువలు అనే పదానికి నీళ్ళొదిలేసి విశ్వసనీయత అనే పదానికి సమాధి కట్టి ఆంధ్రప్రదేశ్ పై సాక్షి మీడియా, జగన్ మాఫియా చేస్తున్న విష ప్రచారం నానాటికి అద్దులు దాటుతుంది.
అయితే వీళ్ళ ఆరోపణలకు టీడీపీ నేతలు కూడా గట్టి కౌంటర్లే ఇస్తున్నప్పటికీ ఐదేళ్ల అధికార మదం, అక్రమ సంపాదన వైసీపీ నోటికి తాళం వేయలేకపోతుంది. నీతులు చెప్పడానికే పాటించడానికి కాదు అనేది వైసీపీ అభిమతంగా మారిపోయింది. వ్యవస్థలు ఒక్కసారి గాడి తప్పితే వచ్చే ప్రమాదం ఊహించని జగన్ గత ఐదేళ్లుగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి వినోదం చూసారు.
ఇప్పుడు వాటి తాలూకా విధ్వంసానికి బాధ్యత వహించాల్సిన జగన్ రెడ్ బుక్ అంటూ ఎదుటి వారి మీద నిందలు వేస్తూ తన ఆలోచన తాలూకా రక్తపు మరకలను పసుపు జెండాకు పూయడానికి చూస్తున్నారు. అలాగే నిత్యం అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేసే సాక్షి తన కథనాలతో రాష్ట్రానికి నీలి నీడలా మారింది. దీనితో సాక్షి రాతలో జగన్ మాటలో మార్పు కోరుకోవడం అత్యాశే అవుతుందేమో..!




