‘సర్ధార్ గబ్బర్ సింగ్’ లీలల ప్రభావం ఇది!

Sardar Gabbar Singh Distributor Losses - Katamarayudu Newsగతేడాది బాక్సాఫీస్ వద్ద బాంబులా పేలిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా, నిజంగానే డిస్ట్రిబ్యూటర్ల గుండెలో బాంబులను పేల్చిందని, తాజాగా ఒక దాని తర్వాత మరొకటి జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలే కృష్ణాజిల్లాలో ‘సర్ధార్’ను పంపిణీ చేసిన సంపత్ కుమార్ మీడియా ముందుకు వచ్చి, తన ఆవేదనను వెలిబుచ్చగా, తాజాగా నైజాం డిస్ట్రిబ్యూటర్ వంతు వచ్చింది.

నైజాంలో “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాను పంపిణీ చేసినందుకు గానూ తమకు 8 కోట్ల మేర నష్టం వచ్చిందని, ఇందుకు గానూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘కాటమరాయుడు’ సినిమా హక్కులను తమకు ఇస్తామని చెప్పారని, కానీ, ఇప్పుడేమో ఈ సినిమా హక్కులను వేరే వారికి ఇచ్చేసారని, ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తుంటే నిర్మాత శరత్ మరార్, మేనేజర్ శ్రీనివాస్ లు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

ADVERTISEMENT

ఇతర ఏరియాలలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా ద్వారా నష్టపోయిన వారికే ఈ ‘కాటమరాయుడు’ సినిమాను ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ, తమకు మాత్రం అన్యాయం చేస్తోందని డిస్ట్రిబ్యూటర్లు అయిన దిలీప్ టాండన్, తరుణ్ తదితరులు వాపోయారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నామని, పవన్ దాకా సమాచారం చేరితే ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.

ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూటర్ చెప్పగా, తాజాగా నైజాం డిస్ట్రిబ్యూటర్ల వంతు వచ్చింది. ఇదిలా ఉంటే నైజాంలో ‘కాటమరాయుడు’ సినిమా పంపిణీ హక్కులను హీరో నితిన్ కు ఇచ్చిన విషయం తెలిసిందే. మరి చివరి నిముషంలో చేతులు మార్పులు ఉంటాయో లేక ‘కాటమరాయుడు’ విడుదల తర్వాత అసలు కధ తేలుతుందో ఏమో గానీ, “సర్ధార్ గబ్బర్ సింగ్”ను మాత్రం పంపిణీదారులు మరిచిపోలేకపోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories