సోమవారం కూడా శశికళకు నిరాశ తప్పేలా లేదు!

Sasikala Natarajan - Tamil Nadu Politicsశశికళ అక్రమాస్తుల కేసుపై సోమవారం తీర్పు వచ్చే సూచనలు కనిపించడం లేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో రెండో నిందితురాలిగా ఉన్న శశికళ భవితవ్యం సుప్రీంకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంది. సోమవారం నాడు విచారించే కేసుల జాబితాలో శశికళ అక్రమాస్తుల కేసును సుప్రీంకోర్టు చేర్చకపోవడంతో, ఈ తీర్పు కోసం వేచిచూస్తున్న శశికళకు మండే కూడా నిరాశను మిగల్చవచ్చని తెలుస్తోంది. మరో వారం రోజుల్లోనే ఈ కేసులో తీర్పు ఉంటుందని జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ధర్మాసనం గత వారం చెప్పడంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే, క్షణక్షణానికీ తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నివాస ప్రాంతమైన కుమారస్వామి రాజా సలాయ్ ఇంటికి వస్తున్న ప్రజలు, అభిమానుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, పరిస్థితిని అదుపు చేయలేకపోతున్న పోలీసు అధికారులు, మరింత బలగాలను పంపాలని నిర్ణయించాయి. పన్నీర్ భద్రతను పర్యవేక్షిస్తున్న అధికారుల కోరిక మేరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఐఎస్ఎఫ్ బలగాలను ఆయన ఇంటికి పంపనున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం నుంచి ఆయన ఇంట్లోనే ఉండి, తన వద్దకు వస్తున్న ప్రతి ఒక్కరి నుంచి అభినందనలు స్వీకరిస్తూ ఉండటంతో, లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు.

ADVERTISEMENT

వీధికి అడ్డుగా ఉన్న బారికేడ్లను తోసేసుకుని లోపలికి జొరబడుతున్న వేళ, స్వల్ప సంఖ్యలో ఉన్న పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఆపై కూడా భారీ ఎత్తున అభిమానులు వస్తుండటం, వారిలో అసాంఘిక శక్తులు జొరబడే అవకాశాలు ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అదనపు భద్రత కల్పించాలని నిర్ణయించారు. పన్నీర్ ఇంటికి అర కిలోమీటర్ దూరంలోనే బారికేడ్లు, బలగాలను మోహరించి, వచ్చిన వారిని క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే లోపలికి పంపాలని అధికారులు ఆదేశాలిచ్చారు.

మరోవైపు శశికళ, పోయిస్ గార్డెన్ లోనే ఉన్నప్పటికీ, నిన్న, మొన్న కనిపించినంత మంది కాదు కదా… కనీసం వేళ్లపై లెక్కించేంత మంది కూడా ఆమె ఇంటి ముందు కనిపించడం లేదు. ఒక్కరు కూడా లేకుండా నిర్మానుష్యంగా ఉన్న వేద నిలయాన్ని ఒక వైపు, ప్రజలు, అభిమానులతో కిక్కిరిసిన పన్నీర్ సెల్వం ఇంటిని మరోవైపు చూపుతూ వార్తా చానళ్లు ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్నాయి. మరింత మంది ఎమ్మెల్యేలు పన్నీర్ వైపే చూస్తున్నారని తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories