కొండా సురేఖ మంత్రి పదవి ఊడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డితో సహా పలువురు పచ్చ పార్టీ (తెలుగుదేశం)లో నుంచి వచ్చారంటూ చాలా చులకనగా మాట్లాడారు.
ఆమె వారిని విమర్శించాలనుకుంటే విమర్శించవచ్చు. కానీ చేజేతులా ఇలాంటి దుస్థితి తెచ్చుకొని మద్యలో టీడీపిని విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కాంగ్రెస్‌లో ‘పచ్చపార్టీ’ నేతలంటూ చులకనగా మాట్లాడారు. ఆయనకు మంత్రి సీతక్క అదిరిపోయే జవాబు ఇచ్చారు.
“మీ నాయన కేసీఆర్ అదే పచ్చ పార్టీ నుంచి వచ్చారు కదా?ఆ పచ్చ పార్టీ నుంచే నేతలను తెచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకున్నారుగా? వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారుగా?
మీ పార్టీలో ఎవరిని చేర్చుకున్నా ఆణిముత్యాలు కింద లెక్క. అదే.. వేరే పార్టీలో చేరితే వారు లుచ్చాగాళ్ళా?
వేరే పార్టీలో ఉన్నప్పుడు లుచ్చాగాళ్ళయితే, అలాంటి వాళ్ళని తెచ్చి పెట్టుకున్న మిమ్మల్ని ఏమనాలి?” అని సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితి, మారిన బలబాలు, నాయకుల సమస్యలు, అవసరాలు, ఒత్తిళ్ళ కారణంగా పార్టీలు మారారు. ఒక పార్టీ నాయకులు మరో పార్టీలోకి మారారు. నేటికీ పార్టీలు మారే నాయకులు కనిపిస్తూనే ఉన్నారు.
వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత కాలం మంచోళ్ళు, వేరే పార్టీలో చేరగానే చెడోళ్ళుగా ఎలా మారిపోతారు? అలాగే ఆ చెడోళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరగానే ‘మంచోళ్ళుగా ఎలా మారిపోతారు?” అని మంత్రి సీతక్క ప్రశ్నించారు.
ఒకవేళ నాడు సిఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కి మంత్రి పదవి ఇచ్చి ఉండి ఉంటే, కేసీఆర్ బయటకు వెళ్ళేవారే కారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టేవారు కారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసేవారు కారనే వాదనలు నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి. అదే జరిగి ఉండి ఉంటె బహుశః కేసీఆర్ కూడా నేడు టీడీపిలోనే ఉండేవారేమో?





