రెండు తెలుగు రాష్ట్రాలలో విపక్షంలో ఉన్న వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు సొంత కుటుంబ సభ్యుల నుంచే రాజకీయ పోటీని ఎదుర్కుంటున్నారు. ఏపీలో వైసీపీ పార్టీకి గుదిబండలా కాంగ్రెస్ కండువాతో షర్మిల, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి స్పీడ్ బ్రేకర్ లా తెరాస పార్టీ తో కవిత ఇద్దరు ఒకరు అన్న ఓటమి కోసం మరొకరు అన్న పతనం కోసం రాజకీయ యుద్ధం చేస్తున్నారు.
అయితే ఇందులో కవిత కొత్త పార్టీతో తండ్రి స్థాపించిన బిఆర్ఎస్ తో రాజకీయ యుద్దానికి సిద్దమవ్వగా షర్మిల తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో అన్న పార్టీ వైసీపీ మీద సై అంటూ ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఇద్దరి రాజకీయ లక్ష్యాలు నెరవేరాలి అంటే కవిత తన తెరాస పార్టీతో బిఆర్ఎస్ ఓటు బ్యాంకు కు గండికొట్టగలగాలి.
అలాగే షర్మిల వైసీపీ ఖాతాలోకి వెళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు ను తిరిగి వెనక్కి తీసుకురాగలగాలి. ఇలా చెయ్యగలిగితే ఏపీలో షర్మిల రాజకీయ బలం పెరుగుతుంది, అలాగే తెలంగాణలో కవిత తెరాస రాజకీయంగా బలం పుంజుకుంటుంది.
మరి కవిత తన కొత్త తెరాస తో పాత తెరాస ఓటు బ్యాంకును బిఆర్ఎస్ కి దూరం చెయ్యగలుగుతారా.? రాష్ట్ర విభజన తో వైసీపీ ఏర్పాటుతో వైసీపీ కి బదిలీ అయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన రాజకీయ చాణిక్యంతో షర్మిల తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చగలుగుతారా.?
అందు కోసం షర్మిల అధిష్టానాన్ని రంగంలోకి దింపి ఏపీ కాంగ్రెస్ కి తిరిగి జీవం పొయ్యగలగాలి, అలాగే వైసీపీ వెన్నుముక గా నిలిచిన క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ను షర్మిల రెండుగా చీల్చగలిగితే వైసీపీ రాజకీయ భవిష్యత్ కు సమాధి కట్టినట్టే.
అలాగే కవిత కూడా తెరాస తో తెలంగాణ రాజకీయాలలో సంచలనాలు సృష్టించాలి అంటే అందుకు బిఆర్ఎస్ రాజకీయంగా భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. మరి ఆ భారీ మూల్యానికి కవిత తెరాస పునాది వెయ్యగలదా .?




