నేడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బిల్లుల పై, ముఖ్యంగా 30 రోజుల మించి జైలులో ఉంటే అది ప్రధాన మంత్రైనా, ముఖ్యమంత్రైనా, మంత్రైనా ఆ పదవి నుండి తొలగించబడతారు అనే బిల్లు ను ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తుండగా, ముఖ్యంగా కాంగ్రెస్ ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న క్రూరమైన చర్య అంటూ అభివర్ణిస్తుంది.
రాజకీయాలలో నైతికత లోపించిన ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ తరహా బిల్లులను ప్రతిపాదించి ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందంటూ కాంగ్రెస్ ఎంపీ లు, ముఖ్య నాయకులు బీజేపీ నిర్ణయం పై మండిపడుతున్నారు.
ఇటువంటి సమయంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన రూటే సపరేట్ అనేలా కేంద్రం ప్రతిపాదించిన బిల్లుకు తన వంతు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ కు మరోసారి షాక్ ఇచ్చారు. రాజ్యాంగ సవరణ (130) బిల్లుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ శశి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఈ బిల్లులో లోపమేది లేదంటూ ఎన్డీయే ప్రభుత్వానికి అండగా నిలిచారు.
గత కొన్ని రోజుల నుంచి శశి థరూర్ రాజకీయం మొత్తం కాంగ్రెస్ ను విడిచి బీజేపీ వైపు ఆకర్షించబడుతుంది. ఆపరేషన్ సింధూర్ ఘనతను ప్రపంచానికి చాటిచెప్పే కార్యక్రమం లో భాగంగా బీజేపీ అధిష్టానం అఖిల పార్టీల నాయకులను ఆహ్వానించగా అందులో కాంగ్రెస్ నుంచి శశి ఫైనల్ అయ్యారు.
ఇలా శశి ఒక్కో రాజకీయ అడుగు కాంగ్రెస్ కు దూరంగా బీజేపీ కి దగ్గరగా జరుగుతుంది. మరి కాంగ్రెస్ అధిష్టానం శశి రాజకీయ ప్రకటనలను ఇలానే చూస్తూ ఉంటారా.? లేక చర్యలకు ఉపక్రమిస్తారా.?






