Siddharth Takkar Movie Public Talkసిద్దార్థ్ అనగానే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బొమ్మరిల్లే గుర్తొస్తుంది. అందుకే స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయడం ఎప్పుడో మానేసినా ఒకరకమైన సాఫ్ట్ కార్నర్ ఇంకా తన మీదుంది. మహాసముద్రం హిట్టవ్వకపోయినా అంతో ఇంతో టక్కర్ వైపు జనాలు చూశారంటే అది ఇమేజ్ పుణ్యమే. ప్రమోషన్లలో దీని మీద సిద్దార్థ్ చాలా నమ్మకాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. తమిళంలో తీసిన డబ్బింగ్ మూవీనే అయినా బడా బ్యానర్లు అండగా ఉండటంతో మార్కెటింగ్ గట్టిగానే జరిగింది. మరి టక్కర్ అనుకున్నది చేరుకున్నాడా లేదా

మధ్యతరగతి జీవితంతో విసిగిపోయిన గుణశేఖర్(సిద్దార్థ్) కోటీశ్వరుడు కావాలని కలలు కంటుంటాడు. అమ్మాయిలను కిడ్నాప్ చేసే ముఠా మాటలు నమ్మి యాభై లక్షల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. అయినా సరే ఆశ చావక ఎదురు చూస్తున్న టైంలో లైఫ్ కొత్త మలుపులు తిరిగి నచ్చిన అమ్మాయి లక్కీ(దివ్యంశ కౌశిక్) తో ప్రయాణం చేస్తూ ప్రమాదాలను, మాఫియాను వెనకేసుకొని తిరుగుతాడు. ఆ తర్వాత జరిగేది చాలా మటుకు ఊహించేదే. ఈ లైన్ వింటే ఆవారా, అనగనగా ఒక రోజు గుర్తొస్తే ఫీలవ్వకండి

Also Read – వైసీపీ నేతలు ధీమాగానే ఉన్నారు మరి ప్రభుత్వం?

దర్శకుడు కార్తీక్ జె క్రిష్ స్టోరీ లైన్ ఊహించుకున్నంత తేలిగ్గా స్క్రీన్ ప్లేని రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో పాత్రల పరిచయాలు, రెండు మూడు చిన్న ట్విస్టులతో ఏదోలా నెట్టుకొచ్చినా, రెండో సగంలో మాత్రం పూర్తిగా గాడి తప్పేశాడు. లాజిక్స్ ని మరీ సిల్లీగా తీసుకుని రాసుకున్న సన్నివేశాలు ఎంతో కొంత ప్రెజెంటేషన్ వల్ల పాసైనా అసలు బొమ్మ మాత్రం సెకండ్ హాఫ్ నుంచి కనిపిస్తుంది. అతికష్టం మీద తొలిగంట భరించినా గుణ, లక్కీలు కారు ప్రయాణం మొదలుపెట్టాక మనకు నీరసం రావడం స్టార్టవుతుంది.

హీరో హీరోయిన్ మధ్య అంత రొమాన్స్ ఎందుకో అంతు చిక్కదు. ఆడియన్స్ వీళ్ళిద్దరూ ఎలా తప్పించుకుంటారనే దాని మీద దృష్టి పెట్టినప్పుడు అవసరం లేని ప్రేమ డైలాగులు, లాడ్జ్ కెళ్ళి డ్యూయెట్లు పాడుకోవడం చిరాకు పుట్టిస్తాయి. పైగా అంత పెద్ద విలన్ కి బుర్రే లేదన్నట్టుగా యోగిబాబుతో పాటు అతని చుట్టూ ఉన్న రౌడీలతో చేయించిన కామెడీకి ఎక్కడైనా నవ్వొస్తే మన అదృష్టమే. థ్రిల్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నా కార్తీక్ అసలా అవకాశాన్నే వాడుకోకుండా సమయమంతా వృథా చేశాడు. దీంతో టక్కర్ రెంటికి చెడ్డ రేవడి అయ్యింది

Also Read – జాక్ అండ్ లైలా: రెండు స్పీడ్ బ్రేకర్లే

సిద్దార్థ్ కి వయసైపోవడం లేదని మీమ్స్ వచ్చినట్టే తన నటన కూడా వెనకటి రోజుల్లోనే ఆగిపోయిందని గుర్తించడం అవసరం. దివ్యంష కౌశిక్ గ్లామర్ షో చాలనుకోవడంతో ఆమెతో నటింపజేసే సాహసం చేయలేదు దర్శకుడు. అభిమన్యు సింగ్ గబ్బర్ సింగ్ రేంజ్ లో మొదలై గార్బేజ్ రేంజ్ కి పడిపోయింది. పసలేని జోకులతో యోగిబాబు మాత్రం ఏం చేయగలడు. సంగీతం, ఎడిటింగ్, కెమెరా ఇలా టెక్నికల్ టీమ్ మొత్తం పెట్రోల్ లేని కారుని రెండు గంటలు నెట్టుకొచ్చారు. అయితే టైర్లు పంచరైన సంగతి చూసుకోలేదు. దీంతో స్పీడో మీటర్ తిరిగింది కానీ బండి మాత్రం అక్కడే ఉంది




Also Read – పార్లమెంట్ చేసిన చట్టాలను సుప్రీంకోర్టు అడ్డుకోగలదా?