ఓ యాక్టర్, డాక్టర్ లేదా న్యాయవాది తన కొడుకు కూడా తన రంగంలోనే ప్రవేశించి రాణించాలని కోరుకోవడం చాలా సహజం.
విజయనగరం జిల్లాలో ఓ ఎస్సై కూడా తన ఇద్దరు కొడుకులు పోలీస్ శాఖలో ఉన్నతాధికారులవ్వాలని కోరుకున్నారు.
అందుకోసం పెద్ద కొడుకు సిరాజ్‌ని హైదరాబాద్ పంపించగా, అతను నాలుగేళ్ళపాటు అక్కడే ఉండి పోలీస్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాడు. ఎస్సైగా సెలక్ట్ అవలేకపోయాడు. గ్రూప్-2 పరీక్షలలో అర్హత సాధించలేకపోయాడు. కానీ హైదరాబాద్ పరిచయాలతో ఉగ్రవాదిగా మారాడు.
విజయనగరంలో పోలీసులు సోమవారం అతనిని అరెస్ట్ చేశారు.
సిరాజ్ ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ పర్యటించిన తర్వాత మరికొందరితో కలిసి సోషల్ మీడియాలో అల్-హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అనే ఓ గ్రూప్ ఏర్పాటు చేసుకొని, బాంబులు తయారీ, ప్రేలుళ్ళకు సంబందించి మాట్లాడుకునేవారు. దాదాపు ఏడాదిన్నరగాఈ వ్యవహారం గుట్టుగా సాగుతోంది.
ఇటీవల ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాక్‌పై భారత్ దాడి చేయడాన్ని జీర్ణించుకోలేనివారు దేశంలో చాలా మందే ఉన్నారు. వారిలో సిరాజ్ కూడా ఒకరని జాతీయ నిఘా (ఎన్‌ఐఏ) సంస్థ కనుగొంది. దీనికి ప్రతిగా విజయనగరం జిల్లాలో ప్రేలుళ్ళకు సన్నాహాలు మొదలుపెట్టాడు.
ప్రస్తుతం రిమాండ్‌పై విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న సిరాజ్‌ని కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ప్రశ్నించేందుకు ఎన్‌ఐఏ అధికారులు ఎదురుచూస్తున్నారు.
సిరాజ్ అరెస్ట్ గురించి మీడియాలో ఎలాగూ ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అది కాదు. యువతకు ఉద్యోగావకాశాలు లేకపోతే ఏవిదంగా వక్రమార్గంలో పయనించి దేశానికి, సమాజానికి ప్రమాదకరంగా మారుతారో, చివరికి తల్లి తండ్రులకు, కుటుంబాన్ని ఎంత అప్రదిష్టపాలు చేస్తారో గ్రహించేందుకు సిరాజ్ ఓ తాజా ఉదాహరణగా మన కళ్ళెదుటే ఉన్నాడు.
రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళు గడిచినా నేటికీ ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు లేవు. జగన్ 5 ఏళ్ళ నిర్వాకం వలన రావలసినవి రాక పోగా, ఉన్నవి కూడా పోయాయి. అందువల్లే నేటికీ ఆంధ్రా యువత డిగ్రీలు చేతపట్టుకొని ఇరుగుపొరుగు రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. దీనికీ.. సిరాజే ఓ ఉదాహరణ.
ఒకవేళ జగన్ కూడా ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేస్తూ రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించడంపై దృష్టి పెట్టి ఉంటే బహుశః సిరాజ్ నేడు ఈ దుస్థితిలో ఉండేవాడు కాడేమో?
మరో విషయం ఏమిటంటే.. జగన్ చెప్పుకున్నట్లు సంక్షేమ పధకాల ద్వారా సమాజానికి మేలు కూడా జరగలేదని గ్రహించేందుకు సిరాజ్ ఓ ఉదాహరణగా నిలుస్తున్నాడు.
చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో ప్రజలు మళ్ళీ ఆయనకు అధికారం అప్పగించడంతో, ఆయన వెంటనే రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు చిన్న, పెద్ద పరిశ్రమల స్థాపన వివిద దశలలో ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పని చేసి ఉండి ఉంటే నేడు సిరాజ్ జీవితం వేరేలా ఉండేదేమో కదా?




