మూడు రాజధానులకు మార్గం సుగమం చేస్తూ సంబంధిత బిల్లులకు గవర్నర్ రాజముద్ర వెయ్యడంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చిరకాల వాంఛ నెరవేరుతుంది. దీనితో అతిత్వరలో రాజధానిని విశాఖపట్నంకు తరలించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. బాగా ఆలస్యం అనుకుంటే విజయదశమి నాటికి ఆ ప్రక్రియ పూర్తి చెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది.
అయితే ఈ నిర్ణయంతో అమరావతికి భూములిచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అమరావతి నిర్మాణం కోసం 29,481 మంది రైతులు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ల్యాండ్ పూలింగ్ విధానంలో 34,322 ఎకరాల భూమిని ఇచ్చారు. ఈ రైతులలో 5,227 మంది రైతులు ఒకటి నుండి రెండు ఎకరాల భూమిని ఇవ్వగా, మరో 3,337 మంది రైతులు రెండు నుంచి ఐదు ఎకరాల భూమిని ఇచ్చారు.
కాబట్టి, చిన్న మరియు మధ్య తరహా రైతులు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతారు. జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఆపడానికి రైతులు కోర్టుల మీద తమ నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఒకవేళ తరలింపు ఆపిన రైతులు ఆశించిన స్థాయిలో, అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిన స్థాయిలో అమరావతిని జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసే అవకాశం లేదు.
దీనితో ఏ రకంగా చూసినా భూములిచ్చిన రైతులు నష్టపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా… మూడు రాజధానుల గెజిట్‌ను నిలిపి వేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతు పరిరక్షణ సమితి ఈ మేరకు హైకోర్టు గడప తొక్కింది. దీనిని హైకోర్టు ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది.



