తమ వినియోగదారులపై ఎడాపెడా బాదుడుకు సిద్ధమైన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సామాన్యులు… ఇప్పుడు ‘టైం’ మాదంటూ ఎస్‌బీఐని హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లూ తమను ఆటాడుకున్న బ్యాంకులను, ఇప్పుడు తాము ఆటాడుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డబ్బులు దాచుకున్నా పన్ను, డబ్బులు తీసినా పన్ను, కార్డు వాడినా పన్ను, వాడకున్నా పన్ను అంటే తమ వల్ల కాదని తెగేసి చెబుతున్నారు.
ఖాతాల్లో కనీసం 5000 రూపాయలను తాము ఉంచలేమని, అవసరమైతే ఖాతాలను మూసేస్తామని హెచ్చరిస్తున్నారు. తమ డబ్బులు తాము తీసుకునేందుకు ఈ ఆంక్షలేమిటో అంటూ బ్యాంకుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇలా తమ రక్తాన్ని నుంచి పిండి, మాల్యా లాంటి వారికి అప్పులు ఇచ్చేందుకు ఇటువంటి నిబంధనలు విధిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు పారిపోతున్న వారిని ఏమీ చేయలేని బ్యాంకులు సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నాయని అంటున్నారు.
ఇక సహించడం తమ వల్ల కాదంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమానికి తెరలేపారు. అసలు ఈ గోలంతా ఎందుకు? ఖాతాలు క్లోజ్ చేసి ఆ సొమ్మేదో తమ వద్దే భద్రంగా దాచుకుంటామని, అప్పుడు ఈ ట్రాన్సాక్షన్ల గొడవ, ఏటీఎంల గొడవ ఉండదని చెబుతున్నారు. ఎస్‌బీఐ తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుందా సరేసరి, లేకుంటే దేశవ్యాప్తంగా సామాన్యులు తమ ఖాతాలు క్లోజ్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రచారం హోరెత్తుతోంది.
ఇందులో భాగంగా ఏప్రిల్ 6వ తేదీన ‘నో ట్రాన్సాక్షన్ డే’గాను పాటించాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు ఎస్‌బీఐనే ప్రైవేటు బ్యాంకులు కూడా అనుసరించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో వాటికి ఆ అవకాశం ఇవ్వకుండా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ఎస్‌బీఐకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. బ్యాంకులు దిగొచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని సామాన్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఎస్‌బీఐ తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.



